విలక్షణ నటుడి కి మెగాస్టార్ ప్రసంశలు

సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా ద్వారా హీరో, హీరోయిన్‌ల తెలుగు వెండి తెరకు పరచయం కానున్నారు. ఈ సినిమా ఈనెల12న విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపారు. ఈ ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యి సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి ఓ తీపి జ్ఞాపకాన్ని అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ని కొనియాడారు. విజయ్ సేతుపతి మంచి పాత్రకోసం తాపత్రయపడతాడు కానీ తాను కేవలం హీరోగా మాత్రమే చేయాలని అనుకోడని, అటువంటి నటుడు దొరకడం మనం చేసుకున్న అదృష్టం అని అన్నారు. అంతేకాకుండా జార్జియాలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు. ‘మేము జార్జియాలో సినిమా షూటింగ్‌ ఉండటంతో ఓ హోటల్‌లో ఉన్నాం. అక్కడ పొద్దునే అభిమానులు కోకొల్లలుగా వచ్చేశారు. దాంతో అభిమానులు ఇక్కడికి కూడా వచ్చేశారా అనుకుని, ఇక నేను వెళ్లి మాట్లాడాలని అనుకున్నాను. కానీ అప్పటికే అభిమానులు హర్షద్వానాలు చేస్తున్నారు. దాంతో నేను వెళ్లకుండా కేకలు వినిపిస్తున్నాయి ఎవరు వెళ్లారని అడిగాను. అయితే విజయ్ వెళ్లాడని, వచ్చిన వారంతా విజయ్ సేతుపతి అభిమానులని చెప్పార’ని చిరు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఉప్పెన సినిమాకు విజయ్ సేతుపతి ఓకే చెప్పడం కష్టం అనుకున్నారు, కానీ కథ విన్న వెంటనే బుచ్చిబాబుకి ఓకే చెప్పేశాడు. విజయ్ ఎప్పుడూ ఓ మంచి పాత్రకు ప్రాణం పోయాలనే చూస్తాడని చిరు విజయ్‌ని ఎంతగానో మెచ్చుకున్నారు.