కరోనా వాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి హర్షవర్ధన్

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. 2021 మార్చి నాటికి మనదేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కరోనావైరస్ పోరులో ముందున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి తొలుత వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

ప్రయోగాల అనంతరం తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలెవరూ ముందుకు రాకపోతే.. తానే స్వయంగా వ్యాక్సిన్ తీసుకుంటానని కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. టీకాపై ప్రజలకు మరింత భరోసా కల్పించడానికి తొలి ప్రయోగంగా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి భారతదేశంలో చాలా తక్కువగా ఉందని మంత్రి చెప్పారు. అంతేగాక, మనదేశంలో భారీ ఎత్తున రికవరీ రేటు నమోదవుతుందని తెలిపారు. ఆదివారంనాడు ‘సండే సంవాద్’ పేరిట ఓ కార్యక్రమాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై స్పందించారు.

దేశంలో కరోనావైరస్ వెలుగుచూసిన మొదట్లో కనీసం పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవని.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపారు. కానీ, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేశీయంగా తయారు చేసిన కిట్లనే వాడుతున్నామని కేంద్రమంత్రి చెప్పారు.