హలధారి జయంతి నాడే హలం పట్టి పొలం దున్నే రైతులకు మోడీ నజరానా

పంటల సీజన్ ప్రారంభం కానుండడంతో దేశంలోని పేద రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ నజరానా ప్రకటించి రైతులకు భరోసా ఇచ్చారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) లో భాగంగా ఈ రోజు 8.5 కోట్ల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను బదిలీ చేశారు. అయితే ఈ నగదు బదిలీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో ఆదివారం ఉదయం ఢిల్లీ వేదికగా చేసారు.

అయితే ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం లో భాగంగా ప్రతి ఏటా పేద రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా(రూ.2వేలు చొప్పున) అందజేస్తున్న విషయం తెలిసినదే. ఈ పథకం 2018, డిసెంబర్ 1 నుండి  అమలవుతుండగా ఆరో విడత నగదు బదిలీని ఆదివారం నాడు ప్రధాని ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.75 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

అయితే ఈరోజు మరొక విశేషం ఏమిటంటే హలాన్ని ఆయుధంగా ధరించిన భగవంతుడు బలరాముడి జయంతి. ”భూమిని దున్నే హలాన్నే ఆయుధంగా ధరించిన భగవాన్ బలరాముడి జయంతి కూడా ఇవాళే కావడంతో ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ అభినందనలు. హలధారి జయంతి నాడే రైతులకు ఎంతో మేలు చేసే పీఎం కిసాన్ నిధులను ఖాతాల్లో జమచేయడం చాలా ఆనందంగా ఉంది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదును చేర్చడం ద్వారా ఈ పథకం గొప్ప విజయాన్ని సాధించిందని భావిస్తున్నాను” అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలిపారు.