వ్యాక్సినేషన్‌లో మోదీజీ స్ఫూర్తి నింపారు: డాక్టర్‌ హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 60 ఏండ్లు పైబడిన వారితో పాటు పలు వ్యాధులతో బాధపడే 45 ఏండ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కరోనా వైరస్‌ కట్టడికి ఐసీఎంఆర్‌ ఆమోదించిన కొవిషీల్డ్‌, కొవాక్జిన్‌ వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్‌ తీసుకుని స్ఫూర్తిగా నిలిచినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ కృతజ్ఞతలు తెలిపారు. మనం ముందుండి మార్గదర్శకత్వం వహించాలని చెబుతుండే ప్రధాని మోదీ 60 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన క్రమంలో తొలిగా వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు.

వ్యాధినిరోధకత పెంపొందించే విషయంలో రెండు వ్యాక్సిన్లు కొవిషీల్డ్‌, కొవాక్జిన్‌లు సురక్షితమైనవి, మెరుగైన సామర్థ్యం కలిగినవని మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. మరోవైపు బిహార్‌లో ప్రైవేట్‌ దవాఖానలు సహా రాష్ట్రమంతటా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం నితీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రైవేట్‌ కేంద్రాల్లోనూ ఉచితంగా వ్యాక్సిన్‌ వేసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.