మాతృత్వం ఇంగ్లండ్ రాణి అర్హత కంటే గొప్పది: మారుతి

ఏ మహిళకైనా మాతృత్వం ఓ మధురమైన వరం.. ప్రస్తుతం ఆ మధురానుభూతులను ఆస్వాదిస్తున్న బాలీవుడ్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క. ఈ విషయమై తన బేబీ బంప్ తో ట్విట్టర్లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. మీనా దాస్ నారాయణ్ అనే మహిళా జర్నలిస్టు అనుష్క పోస్ట్ పై వివాదాస్పద వ్యాఖ్య చేసింది. దీంతో వివాదం మొదలైoది.

‘అనుష్క.. నిన్ను విరాట్ కేవలం గర్భవతిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ దేశానికి రాణిని కాదు. మీ ఆనందం అనే గుర్రానికి కళ్లెం వేయండి’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై టాలీవుడ్ దర్శకుడు మారుతి మండిపడ్డాడు. ‘మహిళా జర్నలిస్టు అయ్యుండి.. సాటి మహిళపై ఇలాంటి కామెంట్ ఎలా చేస్తారు. ప్రతి మహిళకు మాతృత్వం ఇంగ్లండ్ రాణి అర్హత కంటే గొప్పది. ఆమెకు తన ఇల్లే రాజ్యం. అక్కడ తాను ఓ రాణి. అనుష్క సెలబ్రిటీ కాకముందు ఓ మహిళ. గర్భవతిగా ఆమె ఆనందాన్ని, తన బేబీ బంప్ ను చూపేందుకు అన్ని విధాలా అర్హురాలు’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

మారుతి మాత్రమే కాదు.. మీనా దాస్ ట్వీట్ పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అనేక మంది సెలబ్రిటీలు, నెటిజన్లు మీనా దాస్ చేసిన కామెంట్ పై మండిపడుతున్నారు.