జాయింట్ కలెక్టర్ దృష్టికి మున్సిపల్ కుళాయిల బురద నీరు

  • ఏటా ఇదే దుస్థితి అంటూ బాటిల్స్ లో నీరు చూపించిన వైనం
  • ఏటా టైఫాయిడ్, పచ్చకామెర్లు తో ప్రజల చావులంటూ ఆవేదన.
  • ఈ సమస్య వెంటనే పరిష్కరించాలి అని కోరిన జనసేన పార్టీ నాయకులు.

పార్వతీపురం మున్సిపల్ కులాయిల్లో గత రెండు రోజులుగా వస్తున్న బురద నీటిని జనసేన పార్టీ నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ కు జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, వంగల దాలి నాయుడు, బంటు శిరీస్, రాజాన రాంబాబు, రాజాన పవన్ కుమార్, వంగలపూడి నాని, గంగిరెడ్ల జగదీష్ తదితరులు కులాయుల్లో వచ్చిన బురదనీటిని బాటిల్స్ లో తీసుకువెళ్లి చూపించారు. ఈ సందర్భంగా వారు జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా ఇదే దుస్థితి నెలకొందన్నారు. ఏటా వర్షాకాలం ఆరంభం నుండి అంతం వరకు ప్రతిసారి మున్సిపల్ కుళాయిల్లో బురద నీరే సరఫరా చేస్తున్నారన్నారు. నిధులు పుష్కలంగా వెచ్చిస్తూ కనీసం స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక క్లోరినేషన్ పరిస్థితి దేవుడికే ఎరుక అన్నారు. ఇదేమంటే అధికారులు కుంటిసాకులు చెప్పే పరిస్థితి అన్నారు. దీనివలన వర్షాకాలంలో పార్వతీపురం పట్టణ ప్రజలు గొంతు నొప్పులు, జలుబులు, దగ్గులు, టైఫాయిడ్, పచ్చకామెర్లుతో బాధపడుతుంటారన్నారు. ప్రతిఏటా కొంతమంది ఆయా రోగాలతో మృతి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కుళాయిలు వచ్చే నీరు తప్ప మరో అవకాశం లేనటువంటి పేదలు, మురికివాడలో నివసిస్తున్న ప్రజలు ఈ నీరు తాగి రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారన్నారు. అలాగే పార్వతీపురం మున్సిపాలిటీ తో పాటు మండలంలో జరుగుతున్న భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ కబ్జాలకు సంబంధించి ఇప్పటికే సబ్ కలెక్టర్ ను ఆదేశించడం జరిగిందని, అలాగే మున్సిపల్ కులాయిల్లో వస్తున్న తగునీటికి వరద నీటికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే మున్సిపల్ పరిధిలో ఎవరికైనా ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇచ్చినట్టుగా అయితే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.