కొత్త డిజిటల్‌ ఓటర్‌ కార్డు

డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్‌ చెయ్యా లని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకి ముందే డిజిటల్‌ ఫార్మేట్‌లోకి మార్చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే ఇకపై ఓటరు తన గుర్తింపు కార్డును పోలింగ్‌ స్టేషన్‌కు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందులో క్యూకోడ్‌ ద్వారా సమాచారాన్ని కార్డులో భద్రపరుచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంలో ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సదరు అధికారి తెలిపారు. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, పలు రంగాల అధికారుల నుంచి సలహాలు, ఆలోచనలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డిజిటల్‌ కార్డు మొబైల్‌, వెబ్‌సైట్‌, ఈ మెయిల్‌ ద్వారా వేగంగా, తేలికగా గుర్తింపు కార్డులను ఓటరుకు అందించడమే ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిజికల్‌ కార్డు ప్రింట్‌ చేయడానికి సమయం, ఓటరును చేరుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. డివిజన్‌ విధానంలో ఓటరు ఫొటో కూడా స్పష్టంగా ఉంటుందని, తద్వారా గుర్తింపు మరింత సులభతరమవుతుందని వివరించారు. మరో సీరియర్‌ పోల్‌ ప్యానెల్‌ అధికారి మాట్లాడుతూ తుది నిర్ణయం తీసుకునే ముందు భద్రతా అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.