కేరళలో ‘నిఫా’ కల్లోలం! ఈ వైరస్ కు మందు లేదు..కట్టడి ఒక్కటే మార్గం!

ఓ వైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్‌ కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. నిఫా కలకలంతో అప్రమత్తమైన కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఏకకాలంలో రెండు వైరస్‌లతో పోరాడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్‌ భీకరంగా వ్యాపిస్తుండగా.. తాజాగా నిపా వైరస్‌ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల నుంచి వచ్చినవే. కానీ.. వీటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి.

కేరళ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది నిఫా వైరస్. తాజాగా కోజికోడ్ జిల్లా లో నిఫా వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. నిఫా వైరస్‌ కలకలంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరఫున ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ప్రస్తుతం ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పరిశీలన జరుగుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.

వ్యాధి లక్షణాలు ఏంటంటే..
నిపా వైరస్‌ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. దీనిని జునోటిక్‌ వ్యాధి అంటారు. దీనిని 1999లో తొలిసారిగా మలేషియాలో నిఫా వైరస్‌ను నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత 2001లో బంగ్లాదేశ్‌లో నిఫా కేసులు వెలుగుచూశాయి. ఒకరి నుంచి ఒకరిని తాకడం వల్ల ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తలతిరగడం, వాంతులు, జ్వరం ఈ వైరస్‌ లక్షణాలని చెబుతున్నారు. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్‌ ఉంటుంది.

ఇది చాలా ప్రమాదకరం…
2018లో కేరళలో వచ్చిన కేసులు పెరంబ్ర తాలుకా ఆసుపత్రి, కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలోనే నమోదయ్యాయి. తొలి రోగికి ఇక్కడే చికిత్స చేశారు. వైరస్ తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లోనే బాధితులు మృతి చెందే ప్రమాదముంది. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్‌ వెరీ డేంజరస్‌ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). ఇప్పటివరకు ట్రీట్‌మెంట్‌ లేని ఈ ప్రాణాంతక వైరస్​ నుంచి ప్రజలను రక్షించుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. నిపా వైరస్‌ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్‌ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు.