మున్సిపల్ పోరులో ముగిసిన నామినేషన్ల పర్వం

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈనెల 10న 12కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 17వేల 415 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వేల 900లకు పైగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. కాసేపట్లో ఎస్‌ఈసీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది.

మరోవైపు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. రీనామినేషన్లు అవసరం లేదని స్పష్టం చేసింది.

గతంలో ఏకగ్రీవాలు అయిన వాటినే పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు వార్డు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలను కూడా కొట్టివేసింది. వాలంటీర్ల నుంచి ట్యాబ్ లు, ఫోన్లు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది.