తిరిగి ట్రాక్‌లోకి వచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ జడేజా

మార్చి 4 నుంచి ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగబోయే నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా అస్త్రశస్తాలతో రెడీ అయిపోయింది. దీని తరువాత, టీ 20 సిరీస్‌లో జట్టు పాల్గొంటుంది. ఇందులో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో, పరిమిత ఓవర్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించింది. టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బొటనవేలు గాయం నుంచి కోలుకొని తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన జడేజా బొటనవేలు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కోలుకోవడంతో తాజాగా జడ్డూ మైదానంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్‌లో ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఈ సిరీస్‌లో, బౌలింగ్ పరంగానూ, బ్యాటింగ్ పరంగానూ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జడేజా, గాయం కారణంగా బ్రిస్బేన్‌లో నాల్గవ మ్యాచ్ ఆడలేకపోయాడు. తాజాగా జడేజా ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఇప్పుడు తాను తిరిగి ఫీల్డ్‌లోకి వచినట్లు రాసుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగే టీ 20 లేదా వన్డే సిరీస్‌లో జడేజా తిరిగి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.