కార్పొరేట్ వ్యవసాయంపై ఆసక్తి లేదు

నూతన వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరుతుంది అనే విమర్శలపై రిలయన్స్ స్పందించింది. కాంట్రాక్ట్ లేక కార్పొరేట్ వ్యవసాయ, వ్యాపారానికి (ఫార్మింగ్ బిజినెస్) లోకి అడుగు పెట్టే ఆలోచన తమకు లేదని వెల్లడించింది. కాగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తమ జియో టవర్లను రైతులు నాశనం చేయడంపై ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల అన్నదాతలు ముఖ్యంగా పంజాబ్ లో 1500 కు పైగా రిలయన్స్ టవర్లకు తీవ్ర నష్టం కలిగించారు. కేబుల్ వైర్లను కట్ చేశారు. జియో టవర్లన్నీ వీరి ఆగ్రహానికి గురయ్యాయి. అయితే ఇలా ఆస్తులను నాశనం చేయడంవల్ల తమ సంస్థకు చెందిన ఎంతోమంది ఉద్యోగుల జీవితాల్లో అభద్రత ఏర్పడిందని, వారు ఆందోళన చెందుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. ఈ మేరకు పంజాబ్ హర్యానా హైకోర్టులో రిలయన్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అసలు ఈ విధమైన దుశ్చర్యల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నాయని, వారు అసలు అన్నదాతలేనా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొంది.

రైతు చట్టాల కారణంగా ముఖ్యంగా ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు భావిస్తున్నారు. అందువల్లే తమ ఆగ్రహాన్ని జియో టవర్లపై చూపారు. అయితే తమ వ్యతిరేకులెవరో వీరిని రెచ్ఛగొడుతున్నట్టు కనిపిస్తోందని, ప్రభుత్వం తమ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకునేలా చూడాలని రిలయన్స్ యాజమాన్యం కోర్టును కోరింది. నిజానికి కార్పొరేట్ వ్యవసాయంపై తమకు ఆసక్తి లేదని, పంజాబ్, లేదా హర్యానాలో భూములను స్వాధీనం చేసుకోవాలన్న యోచన తమకు లేదని స్పష్టం చేసింది. మన దేశానికి అన్నదాతలైన వీరిపట్ల తమకెంతో గౌరవం ఉందని, ఏమైనా తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని తమ టవర్లకు భద్రత ఉండేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.