ఇప్పటం కూల్చివేతలకు నిరసనగా జనసేన నేతల నిరాహార దీక్ష

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం మరోసారి అక్రమంగా ఇళ్ల కూల్చివేతలకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం చుట్టూ 200 మందికి పైగా పోలీసులను మోహరించి ఇళ్లల్లో ఉన్న ప్రజలను బయటకు రానీయకుండా నిర్బంధించి కూల్చివేతలు మొదలు పెట్టారు. ఇప్పటం గ్రామస్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన జనసేన నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పార్టీ స్థానిక నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, పీఏసీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇతర ముఖ్యనేతలంతా కలిసి పొలాల మధ్య నుంచి ఇప్పటం గ్రామానికి చేరుకొని కూల్చివేతలు నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఇప్పటం గ్రామంలో నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం శాశ్వతంగా కూల్చివేతలు నిలిపివేస్తామని చెప్పే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. నిరాహార దీక్ష చేస్తున్న జనసేన నాయకులకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరినా… కూల్చివేతలు నిలిపివేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని నాయకులు తేల్చి చెప్పారు. నిరాహార దీక్షలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరావు, పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ రాష్ట్ర చేనేత వికాస అధ్యక్షులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఇస్మాయిల్ బేగ్, తాడేపల్లి మండల ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు శ్రీమతి కోమలి, కృష్ణమోహన్ పాల్గొన్నారు.