రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు మచిలీపట్నం సభ నాంది

* వైసీపీని ఇంటికి పంపించే విధంగా పోరాటం చేద్దాం
* రాష్ట్రాన్ని అంధకారం నుంచి అభివృద్ధిపథంలో నడిపిద్దాం
* శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు
* ఎన్ని అటుపోట్లు ఎదురైనా నీతిగా, నిజాయతీగా నిలబడ్డారు
* ఇప్పటంలో ఇళ్లు కూలగొట్టి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారు
* వైసీపీ అరాచకపాలన అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయి
* భీమవరం జనసేన సమావేశంలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మచిలీపట్నంలో జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఉండబోతుందని, సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని ఇంటికి పంపించే విధంగా మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సంక్షేమం అంటే బటన్ నొక్కడం కాదని, స్పందించే మనస్తత్వం ఉండటమని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటపడేసి అభివృద్ధిపథంలో నడిపించే నాయకత్వాన్ని ఎన్నుకుందామని పిలుపునిచ్చారు. జనసేన నాయకుల్లో దమ్ము, ధైర్యం, పట్టుదల ఉంది కాబట్టే ప్రభుత్వం మనల్ని చూసి భయపడుతోందని, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మరింత బలంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. శనివారం ఉదయం భీమవరంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకొద్దామని శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన దగ్గర కేవలం రూ.7 లక్షల మాత్రమే ఉన్నాయి. జనసేన పార్టీ ఈ రోజుకీ నిలకడగా, నిజాయతీగా ప్రజల కోసం పనిచేస్తోంది అంటే… శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరిలో నింపిన స్ఫూర్తే కారణం. ఎన్ని అటుపోట్లు ఎదురైనా తొమ్మిదేళ్లుగా పార్టీని తన భుజస్కందాలపై మోశారు. ఇప్పుడు ఆ బాధ్యత మనందరం తీసుకునే సమయం ఆసన్నమైంది. అందరం కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్దాం.
* ఏ కార్యక్రమమైనా ప్రజల కోసమే చేపట్టారు
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత భీమవరం వస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి కారును భవన నిర్మాణ కార్మికులు ఆపి తమ కష్టాలను చెప్పారు. ఇసుక కొరత వల్ల రోజుల తరబడి తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలుసుకొని చలించిపోయిన పవన్ కళ్యాణ్ .. వెంటనే విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేపట్టారు. ఏ కార్మికుడూ పస్తులు ఉండకూడదని డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికుల కుటుంబాల కడుపులు నింపారు. ఆ తరువాత ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడ్డారు. జనవాణి కార్యక్రమం చేపట్టి ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. ఇలా ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజల కోసమే చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ పార్టీ చేపట్టని విధంగా కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకొచ్చారు. జన సైనికుడి కుటుంబం ఆపదలో ఉంటే ఆదుకునే విధంగా పార్టీ నుంచి రూ.5 లక్షలు అందిస్తున్నారు. ఈ రోజు ఇన్ని లక్షల మంది పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు అంటే దాని కారణం బీమా వస్తుందని కాదు… శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీపై ఉన్న నమ్మకంతో సభ్యత్వం తీసుకున్నారు.
* ముఖ్యమంత్రిని సైకో అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్ధమైంది
విశాఖలో ఇన్వెస్టర్ల సమ్మిట్ జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు తరలివస్తారు. పెట్టుబడులు వస్తే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని సదుద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులు ప్రభుత్వంపై విమర్శలు చేయం అని చెబితే… జనసేన సభకు స్థలం ఇచ్చిన రైతుల ఇళ్లను కూల్చేసి ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రభుత్వ అరాచకాన్ని అడ్డుకోవడానికి వెళ్తున్న జనసేన నాయకులను పోలీసు వ్యవస్థను ఉపయోగించి అడ్డుకుంటున్నారు. ఇప్పటం గ్రామస్థులపై జరుగుతున్న దాడిని జనసేన పార్టీపై జరుగుతున్న దాడిగా పరిగణిస్తాం. ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు కాబట్టే ఆయన్ని అందరూ సైకో … సైకో అని పిలుస్తారు.
* కుళాయి కనెక్షన్ కు ఎమ్మెల్యే పర్మిషన్ కావాలా?
భీమవరం ప్రాంతానికి నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే 108 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు స్థలాన్ని జగనన్న కాలనీల కోసం ఎందుకు కేటాయించారు? ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ కోసం ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలా? ఇదేం పాలనా? వైసీపీ అరాచకపాలన తరిమికొట్టడానికి అందరం కలిసి కట్టుగా పోరాడుదాం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినంత మాత్రనా అది ఓటుగా మారదు. ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, విధానాలు వివరించి వారిని ఆకర్షించగలిగితే అవి ఓట్లుగా మారుతాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు స్థానిక ఎన్నికల్లో ఎంతో మంది జనసైనికులు, వీరమహిళలు పోటీ చేశారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నామినేషన్లు వెనక్కి తీసుకోలేదు. అలాంటి స్ఫూర్తితోనే కొత్త తరానికి ఉపయోగపడే విధంగా పార్టీని బలోపేతం చేద్దాం” అని అన్నారు.
* ఓటుకు నోటు ఇవ్వకుండా పోటీ చేసే దమ్ముందా?: శ్రీ కొటికలపూడి గోవిందరావు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం జేబులు నింపుకోవడానికి పని చేస్తుంటే… జనసేన పార్టీ మాత్రం ప్రజల కష్టాలను తీర్చడానికి పనిచేస్తోంది. జనసేన నాయకులకు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. వైసీపీకి ఓటుకు నోటు ఇవ్వకుండా పోటీ చేసే దమ్ముందా? రోడ్లు వేయమంటే డబ్బులు లేవంటారు, జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేం తెలియదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు”అన్నారు.
* జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం
ఇటీవల భీమవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీలక సభ్యులు శ్రీ కటిక సురేష్, ఉంగుటూరు నియోజక వర్గానికి చెందిన శ్రీ గొట్టపు వాసుదేవరావు కుటుంబాలను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించారు. వారికి పార్టీ తరఫున రూ.5 లక్షల బీమా చెక్ లను అందించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యులు శ్రీ చేగొండి సూర్యప్రకాష్, శ్రీ కనకరాజు సూరి, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, పార్టీ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ విడివాడ రామచంద్రరావు, శ్రీ రెడ్డి అప్పలనాయుడు, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి మధులత, శ్రీ గుండా జయప్రకాష్, శ్రీ చెన్నమల్ల చంద్ర శేఖర్, శ్రీ చాగంటి మురళీకృష్ణ, శ్రీ జుత్తుగ నాగరాజు, పార్టీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.