ఆధునీకరణే థ్యేయంగా Xi Jinping సిపిసి ఆరవ ప్లీనరీ ప్రారంభం..

చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి)19వ కేంద్ర కమిటీ ఆరవ ప్లీనరీ సమావేశం సోమవారం నాడిక్కడ ప్రారంభమైంది. సిపిసి ప్రధాన కార్యదర్శి సీ జిన్‌పింగ్‌ పార్టీ పొలిట్‌బ్యూరో తరపున కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సిపిసి వందేళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రధాన విజయాలు, గడించిన చారిత్రిక అనుభవాలను ముసాయిదా తీర్మానంలో ప్రస్తావించారు. ఈ ప్లీనరీ సమావేశం గురువారంతో ముగియనుంది. సిపిసి పొలిట్‌బ్యూరో అక్టోబరు 18న జరిపిన సమావేశంలో ఖరారు చేసిన ముసాయిదా తీర్మానాన్ని ఈ ప్లీనం ముందుంచింది. దేశంలోని అన్ని జాతులను, తెగలను కలుపుకుని ముందుకు సాగడంలో సిపిసి చెప్పుకోదగ్గ విజయం సాధించిందని ఆ ముసాయిదా తీర్మానం పేర్కొంది. ఆధునిక యుగంలో బయట నుంచి బెదిరింపులు, అణచివేతను ఎదుర్కొని చైనా ప్రజలు నిలబడ్డారని, అన్ని రంగాల్లో ఆధునికతను సంతరించుకుంటూ ముందుకు సాగాలని ముసాయిదా తీర్మానం ఉద్ఘాటించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, జాతీయ పునరుజ్జీవానికి అందివచ్చిన అవకాశాలను అన్నిటిని అంది పుచ్చుకుంటున్నదని పేర్కొంది. చైనా కమ్యూనిస్టు యోధులు మావో జెడుంగ్‌, డెంగ్‌సియావోపెంగ్‌, జియాంగ్‌ జెమిన్‌, హు జింటావో నేతృత్వంలో యావత్‌ పార్టీ, ప్రజలు ఏకతాటిపై నిలిచి సాధించిన విజయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలపింది. 2012లో జరిగిన సిపిసి 18వ మహాసభ నుంచి సీ జిన్‌పింగ్‌ నేతృత్వంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిజం తన సత్తాను చాటిందని పేర్కొంది. మునుపెన్నడూ లేని విధంగా సైన్యం  ప్రజలు ఏకతాటిపై నిలవడమే గాక, చైనా అంతర్జాతీయంగా తన హౌదాను సుస్థిరపరచుకుందని ముసాయిదా పేర్కొంది.