కొనసాగుతున్న భారత్ బంద్.. రోడ్డెక్కిన రైతులు..

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 13వ రోజుకు చేరింది. దిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, ట్రికీ రహదారుల్లో వేలాది మంది కూర్చుని శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. చట్టాలపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో మంగళవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింఘ, టిక్రీ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. భారీగా సాయుధ బలగాలు మోహరించారు.

అన్నదాతల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. అయితే భాజపా పాలిత రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ ప్రభావం స్వల్పంగా కన్పిస్తోంది. రైతుల ఆందోళన దృష్ట్యా దిల్లీలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

రైల్‌ రోకో..

భారత్‌ బంద్‌కు మద్దతుగా మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో రైతు సంఘాల సభ్యులు రైల్‌ రోకో చేపట్టారు. మల్కాపూర్‌ స్టేషన్‌లో చెన్నై-అహ్మదాబాద్‌ నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి పట్టాలపై నిరసనకు దిగారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు ఒడిశా రాష్ట్రంలోనూ రైతుల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో వామపక్షాలు, రైతు సంఘాల నేతలు రైళ్ల రాకపోకలను అడ్డగించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతలు పట్టాలపై ఆందోళనకు దిగడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమబెంగాల్‌లోనూ వామపక్షాల నేతలు భారత్‌ బంద్‌ను మద్దతిస్తూ పలు రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

కాగా బుధవారం మరోసారి రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరపనుంది. ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపినా రైతులు పట్టువీడలేదు.