4 సంక్షోభాలను అధిగమిస్తాం: బైడెన్‌

అమెరికా ప్రస్తుతం ”కోవిడ్‌-19 మొదలు ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పు, జాతి వివక్ష- సమన్యాయం వంటి నాలుగు సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోందని, మరింత శ్రమించి వాటిని అధిగమిస్తామని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాము బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్క క్షణం కూడా సమయం వృథా చేయకుండా పనిచేస్తామని పేర్కొన్నారు. జనవరి నుంచి సమయం వృథాగా పోనివ్వం. సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు మొదటి రోజు నుంచే చర్యలు తీసుకునేలా నేను, నా బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని బైడెన్‌ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా… ఆరోగ్య సంక్షోభం నుంచి బయపడేందుకు ఉద్దేశించిన ట్రిలియన్‌ డాలర్‌ కరోనా రిలీఫ్‌ బిల్‌కు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారికంగా ఆదివారం ఆమోదముద్ర వేశారు.

‘‘కోవిడ్‌ రిలీఫ్‌ బిల్లు గురించి ఒక శుభవార్త. మరింత సమాచారం గురించి తెలుసుకోండి’’ అని ట్విటర్‌ వేదికగా బైడెన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. కాగా తొలుత ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ట్రంప్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ట్రంప్‌ మొండి వైఖరి కారణంగా లక్షలాది మంది ప్రజలు సహాయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బైడెన్‌ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.