పాతకోట, రేగం రహదారులను త్వరగా నిర్మించాలి: జనసేన డిమాండ్

అనంతగిరి మండల కేంద్రము నుండి మాలింగ వలస, పాతకోట, రేగం, నందిగుమ్మి, మద్ది గరువు, వయా పెదబయలు గ్రామాలను అనుకొని నిర్మిస్తున్న రోడ్డును త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతతో రోడ్డు నిర్మించాలని అనంతగిరి మండల జనసేన పార్టీ నాయకులు, మురళి, నవీన్, ప్రవీణ్, రమేష్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో ఈ రింగ్ రోడ్డు కొరకు నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరయ్యాయని.. అప్పటి అధికారులు కాంట్రాక్టర్లు కలిసి రోడ్డు మధ్యలో వదిలేసి నిధులన్నీ కాజేశారని.. అలాగే మధ్యలో కల్వర్టు కూడా నిర్మించకుండా వదిలేయడంతో ఆయా గ్రామాల గిరిజనులు నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి రావటానికి నానా అవస్థలు పడుతున్నారని.. అత్యవసర వైద్య సేవలు నిమిత్తం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయత్నిస్తున్నారని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా ఈ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మండల కేంద్రానికి రావటానికి సుమారుగా ఒక వంద గ్రామాల గిరిజనులకు సమయం ఆదా అవుతుందని.. సుమారుగా ఒక 30 కిలోమీటర్లు మండల కేంద్రానికి రావటానికి దగ్గరవుతుందని నాయకులు తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ రోడ్డు పనులు జరగకపోవడంతో.. గిరిజనుల పై జగన్ సవతి ప్రేమ చూపిస్తున్నారు అని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.