వారికి ప్రాధాన్యం ఇవ్వండి.. పవన్‌ డిమాండ్‌

రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన నేపథ్యంలో కొత్త రథం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త రథం నిర్మాణానికి ఇప్పటికే కలపను సిద్ధం చేయడంతో పాటు రావులపాలెంలో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఫిబ్రవరిలో స్వామి వారి కళ్యాణోత్సవం లోగా రథం సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

అంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో కొత్త రథం నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. కొత్త రథం నిర్మాణంలో ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలతో పాటు స్ధానికుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ కోరారు. అంతర్వేది లక్ష్మీ నారసింహుడిని అగ్నికుల క్షత్రీయులు కుల దైవంగా పూజిస్తుంటారని, ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించారని పవన్ గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త రథం నిర్మాణంలో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అగ్నికుల క్షత్రియులు తనకు లేఖ రాశారని, వారు ప్రస్తావించిన అంశాలు సరైనవే అని పవన్‌ తెలిపారు. రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రీయలకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం అని ఆరోపించారు.