‘చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలచివేసింది’: పవన్‌ కల్యాణ్‌

సైదాబాద్‌లో ఆరేళ్లబాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. పవన్‌ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సైదాబాద్‌ చేరుకున్నారు. అభిమానుల రద్దీ, తోపులాట కారణంగా కారుదిగి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో చిన్నారి తండ్రిని కారు వద్దకే పిలిపించుకుని పవన్‌ మాట్లాడారు. అభిమానుల తోపులాటలో స్థానికుడి కారు ధ్వంసమైంది. బాధిత కుంటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. ”చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలచివేసింది. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి ఈ సమయంలో ఓదార్పు అవసరం. దోషికి శిక్ష పడే వరకు జనసేన పోరాడుతుంది. బాలిక తల్లిదండ్రులు రాజుపై ముందే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా స్పందించలేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు” అని పవన్‌ తెలిపారు.