రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌కు అనుమతి

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో కిసాన్‌ గణతంత్ర పరేడ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌ను రిపబ్లిక్‌ డే రోజున నిర్వహిస్తామని స్వరాజ్‌ ఇండియాకు చెందిన యోగీంద్ర యాదవ్‌ తెలిపారు. ఢిల్లీ పోలీసులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని, బారికేడ్లు తొలగించగానే రైతులు నగరంలో అడుగుపెడతారని అన్నారు. పరేడ్‌ రూట్‌మ్యాప్‌పై పోలీసులు, రైతుల మధ్య అంగీకారం కుదిరిందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని, ఆపై ఏకాభిప్రాయం దిశగా చర్చలు కొనసాగిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రిపబ్లిక్‌డే నాడు ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో రైతులు రాజధాని సరిహద్దులకు చేరుకున్నారు. ఆమ్‌ ఆద్మీ శ్రీణులు సైతం ఈ ర్యాలీకి మద్దతుగా తరలివచ్చాయి. శాంతియుతంగా పరేడ్‌ నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు.