మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్

భారత్ పెద్దమనసుతో ఇతర దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ స్పందించారు. భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా భూతంతో పోరాడుతున్న ప్రపంచానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ కొనియాడారు. సమష్టి చర్యలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించగలమని, ప్రజల ప్రాణాలను, వారి జీవితాలను నిలపగలమని స్పష్టం చేశారు. భారత్… బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, సీషెల్స్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ వంటి ఆసియా దేశాలకే కాకుండా బ్రెజిల్ వంటి దూరదేశాలకు కూడా కరోనా టీకా డోసులు పంపింది. దాంతో ఆయా దేశాల అధినేతలు, ముఖ్యులు భారత్ కు వేనోళ్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.