కోవిడ్ డెత్ ఆడిట్ కోసం హైకోర్టులో పిల్‌

తెలంగాణలో కరోనా మరణాలపై అనేక అనుమానాలున్నాయి. దాదాపు లక్ష మందికి పైగా చనిపోయారని అంచనా. కానీ.. 3,912 మంది మాత్రమే మృతిచెందారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సుప్రీం ఆదేశాలతో కేంద్రం కరోనా బాధిత కుటుంబాలకు రూ.50వేల సాయం ప్రకటించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కల కారణంగా చాలామందికి సాయం అందే పరిస్థితి లేదని అంటున్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌. రాష్ట్రంలో కరోనా మరణాలపై ప్రభుత్వం డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు పిల్ దాఖలు చేశారాయన.

టీఆర్ఎస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం కోవిడ్ మరణాల సంఖ్యని దాచి పెట్టిందన్నారు శ్రవణ్‌. మరణాలపై దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు కరోనానే లేదనే బ్రాంతి కల్పిస్తూ.. ఫస్ట్, సెకండ్ వేవ్ కలుపుకొని కేవలం 3912 మంది మాత్రమే చనిపోయారని చెప్పడం దుర్మార్గమన్నారు. కానీ.. వాస్తవానికి దాదాపు లక్షా 20వేల మంది చనిపోయారని స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు.

ప్రభుత్వం చెబుతున్న దొంగ లెక్కల కారణంగా 3,912 మందికే లబ్ధి జరుగుతుందన్న శ్రవణ్‌.. మిగతా వారికి ఎవరు న్యాయం చేస్తారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకి పోకుండా కోవిడ్ డెత్ ఆడిట్ నిర్వహించి వాస్తవ మరణాలని వెల్లడించి బాదితులందరికీ న్యాయం చేయాలని కోరారు శ్రవణ్‌.