రాహుల్‌, ప్రియాంకాగాంధీలకు పోలీసుల అనుమతి

హత్రాస్ లైంగికదాడి ఘటనలో బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు పోలీసులు అనుమతినిచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తమ పార్టీ ఎంపీలతో కలిసి రాహుల్‌, ప్రియాంక ఈ మధ్యాహ్నం దిల్లీ నుంచి హాథ్రస్‌ బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. సరిహద్దు గేట్లను మూసివేశారు. హాథ్రస్‌లో 144 సెక్షన్‌ కొనసాగుతున్నందున అక్కడకు వెళ్లేందుకు నేతలకు అనుమతి లేదని తెలిపారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో సంప్రదింపుల చేపట్టిన పోలీసులు కాంగ్రెస్‌ నేతల పర్యటనకు అనుమతిచ్చారు. అయితే ఐదుగురు మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో రాహుల్‌, ప్రియాంక మరో ముగ్గురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరారు.

మరోవైపు హాథ్రస్‌ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రం 4 గంటల్లోగా ఘటనపై నివేదిక ఇవ్వాలని దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.