దాడులు చేసి బూతులు తిట్టినవారికే వైసీపీలో పదవులు

  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా పేర్ని నాని పలుకులు
  • జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, ఏ రాజకీయ పార్టీలో అయినా పదవులు రావాలి అంటే ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాడుతూ, ప్రజలతో మమేకం అవుతూ వారికి అండగా నిలిచిన వారికి పదవులు వస్తాయని, వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ప్రతిపక్ష నేతల్ని, ప్రశ్నించే వారిని అడ్డగోలుగా తిట్టిన వారికి, భౌతిక దాడులు చేసిన వారికి మాత్రమే పదవులు లభిస్తాయని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మైనారిటీ నాయకులు షేక్ నాయుబ్ కమాల్ తో కలిసి ఆయన మాట్లాడారు. వైజాగ్ ఉదంతంలో అరెస్ట్ అయిన జనసేన పార్టీ నాయకులని పవన్ కళ్యాణ్ సన్మానించటంపై మాజీమంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని గాదె ఖండించారు. మంత్రి పదవి పోయి ఖాళీగా కూర్చున్న పేర్ని చెప్పే చిలక పలుకులు ఆపితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అరాచకాలకు, దాడులకు అధికారికంగా పేటెంట్ హక్కులు తీసుకున్న వైసీపీ నేతలు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి శాసనసభ్యులు మొదలుకొని మంత్రులు సైతం అరాచకాలకు, దాడులకు తెగబడటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులపై మారణాయుధాలతో దాడి చేసిన వారికి మున్సిపల్ చైర్మన్ పదవిని, ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మనుషుల్ని కిరాతకంగా చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసేంత దుర్మార్గం రాష్ట్రంలో జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ చేష్టలుడిగి చూస్తుందని దుయ్యబట్టారు. అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ నేతలు విచ్చలవిడిగా విర్రవీగుతున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని జగన్ స్వామ్యం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఉడుత ఊపులకు ప్రపంచంలో ఎవడైనా బయపడతాడేమో కానీ జనసేన పార్టీ కానీ, జనసైనికుడు కానీ వెనకడుగు వేసే ప్రశ్న లేదని, ప్రజల గొంతుకై మీ ఆరాచకాలను, ఆగడాలను నిలదీస్తామని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయుబ్ కమాల్ మాట్లాడుతూ జనసేన పార్టీ పేరు వింటే చాలు వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారన్నారు. వైజాగ్ విమానాశ్రయంలో తమపై జనసైనికులు దాడులు చేశారు అంటూ మంత్రులు కావాలని అక్రమకేసులు పెట్టారని, దమ్మూ ధైర్యం ఉంటే దాడులకు సంభందించిన సాక్ష్యాధారాలను బయటపెట్టాలని కోరారు. విమానాశ్రయానికి రెండు దారులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే దారిలోనే మంత్రులను ఎదురుగా ఎందుకు తీసుకువచ్చారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. పరిపాలన చేతకాక కులమతాల మధ్య ప్రాంతాల మధ్య జగన్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలిచ్చిన అవకాశంలో ఇక మిగిలింది 18 నెలలే అని ఈ కొద్ధి సమయాన్నైనా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ నేతలు హితవు పలికారు. లేనిపక్షంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యంత హీనులుగా మిగిలిపోతారని నాయుబ్ కమాల్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, నారదాసు ప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, అదిశేషు, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.