మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: ఎంపీ నారాయణ్‌ రాణే

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం పాలనలో విఫలమైందని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే కేంద్ర హోంశాఖను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెంటనే తన పదివికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అవినీతి భారీగా పెరిగింది. అందుకే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో రాజీనామా చేయించాలని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశాను’ అని నారాయణ్‌ రాణే పేర్కొన్నారు. ఠాక్రే ప్రభుత్వంలో ముంబైలో సాధారణ ప్రజలకే కాదు.. బిలియనీరైన ముఖేశ్‌ అంబానీకి సైతం రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్‌ ఆగాడీ ప్రభుత్వం సక్రమంగా పని చేయడం లేదని.. ప్రతీది అధికారుల ఇష్టానుసారం జరుగుతుందని రాణే ఆరోపించారు.