కొవిడ్‌ విజృంభ‌ణ: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

దిల్లీ: దేశంలో అత్యంత ప్రమాదకరంగా కరోనా వైరస్‌ కేసులు నమోదవుతోన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. దేశంలో రెండో దఫా కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి.

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 2లక్షల 73వేల కేసులు వెలుగుచూశాయి. మరో 1600మంది కొవిడ్‌ రోగులు మృత్యువాత పడ్డారు. కొవిడ్‌ విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న చాలా రాష్ట్రాల ఆసుపత్రులు రోగులతో నిండిపోతుండడంతో పలుచోట్ల దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత, రెమ్‌డిసివిర్‌ ఔషధంతో పాటు వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా ఉందని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గత కొన్నిరోజులుగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రధాని మోదీ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లు ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఇక వైరస్‌ కట్టడి చర్యలను తప్పకుండా అమలు చేయాలని.. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌తో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్రాలు మరింత ముమ్మరంగా చేపట్టాలని స్పష్టం చేశారు.