సామాన్యుడి ఇంటి కోడలైన జపాన్‌ రాకుమారి మకో

అంగరంగ వైభవమైన వేడుకలు.. రాజప్రాసాదంలో ధగధగలు.. కళ్లు మిరుమిట్లు గొలిపే అలంకరణ.. ఘుమఘుమలాడే విందు భోజనాలు.. అంబరాన్నంటే సంబరాలు ఇవేవీ లేకుండానే ఆ యువరాణి వివాహం జరిగింది. అయితేనేం మనసు దోచిన మనిషిని మనువాడానన్న సంతోషం ముందు అవేమీ అక్కర్లేదనిపించిందా రాకుమారికి. అందుకే రాచరికాన్ని, కోట్లాది రూపాయల రాజభరణాన్ని తృణప్రాయంగా వదులుకుని సామాన్యుడి ఇంట కోడలిగా అడుగుపెట్టింది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత జపాన్‌ రాకుమారి మకో ఎట్టకేలకు తన ప్రేమను గెలిపించుకుని ప్రియుడు కీ కొమురోతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

మకో – కిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్‌ ప్యాలెస్‌ అధికారికంగా ధ్రువీకరించింది. పెళ్లి తర్వాత మకో రాజప్రసాదాన్ని వీడారు. వీరి వివాహానికి మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్యాలెస్‌లో ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కూడా ప్రకటించారు. ఇంటి నుంచి బయటకొచ్చే ముందు మకో.. తన తల్లిదండ్రులను, సోదరిని హత్తుకుని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

జపాన్‌ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తె అయిన మకో.. టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో చదువుకున్నారు. అక్కడే తనతో పాటు చదువుకునే సామాన్యుడు కొమురోను ఇష్టపడ్డారు. 2017లోనే ఈ జంట తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అయితే మరుసటి ఏడాది కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో ఈ పెళ్లి అప్పట్లో రద్దయ్యింది. దీంతో 2018లో కొమురో లా చదివేందుకు న్యూయార్క్‌ వెళ్లిపోయారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు కొమురో జపాన్‌ వైపు తిరిగి చూడలేదు. దీంతో రాణివాసాన రామచిలకలా మిగిలిపోయారు మకో.

గత నెల చదువు పూర్తి చేసుకుని కొమురో స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఈ జంట మళ్లీ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. ఆర్థిక వివాదంపై స్పష్టత ఇవ్వాలని మకో తండ్రి కొమురోను అడిగారు. దీనిపై ఆయన లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలిపారు. అయితే గతంలోని ఆర్థిక వివాదాలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నందున.. వివాహానికి రాజకుటుంబం పెద్దగా హడావుడి చేయలేదు. సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించలేదు. వీరు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా పత్రాలు మాత్రం విడుదల చేసింది.

జపాన్‌ రాజ కుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధపడ్డ మకో.. రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్ల (150 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించింది.