ఉత్తరప్రదేశ్ ఇన్ చార్జిగా ప్రియాంక కీలక బాధ్యతలు

కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణయ మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సహా కేంద్ర ఎన్నికల కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. అదే క్రమంలో వివిధ రాష్ట్రాలకు ఇన్ చార్జిలను కూడా నియమించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఫుల్ టైమ్ ఇన్ చార్జిగా ప్రియాంక గాంధీ వాద్రా నియమితులయ్యారు.

2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితురాలైన ప్రియాంక గాంధీ.. తూర్పు ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా బాధ్యతలు తీసుకుని సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు. నాడు పశ్చిమ యూపీ ఇన్ చార్జిగా వ్యవహరించిన జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి ఫుల్ టైమ్ ఇన్ చార్జిగా ప్రియాంకను నియమించారు. 2022లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రియాంక నియామకం కీలకంగా మారింది.

ప్రియాంకతోపాటు మరికొందరు నేతలను కూడా వివిధ రాష్ట్రాల ఇన్ చార్జిలుగా నియమిస్తూ ఏఐసీసీ శుక్రవారం రాత్రి ప్రకటనలు చేసింది. జనరల్ సెక్రటరీ హోదాలో ముకుల్ వాస్నిక్ (మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా), పంజాబ్ కు హరీశ్ రావత్, ఏపీకి ఉమన్ చాందీ, కేరళ, లక్షద్వీప్ కు తారీఖ్ అన్వర్, కర్ణాటకకు రణదీప్ సుర్జేవాలా, అస్సాంకు జితేంద్ర సింగ్, రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా అజయ్ మాకెన్ మరియు  పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీగా కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు.