‘యాదాద్రి’గా మారిన ‘రాయగిరి’ రైల్వేస్టేషన్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్‌ను ఇకపై యాదాద్రిగా పిలవనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రిగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. నేటి నుంచి రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రి రైల్వేస్టేషన్‌గా సంబోధించనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. స్టేషన్‌ కోడ్‌ YADDగా నిర్ణయించినట్లు తెలిపింది. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం పూర్తయ్యాక హైదరాబాద్‌ జంట నగరాల నుంచి శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో దాదాపు లక్ష మంది వరకు దర్శనానికి వచ్చే అవకాశముంటుందని, భక్తుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్‌ రైలును యాద్రాద్రి వరకు నడపాలని సీఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వాన్ని ఇప్పటికే కోరారు. ఘట్‌కేసర్‌ వరకు విస్తరించిన రైల్వే లైన్‌ను పొడిగించాలని విన్నవించారు. యాదాద్రి రైల్వేస్టేషన్‌ను మోడల్‌స్టేషన్‌గా మార్చాలని, దీన్ని ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విస్తరించాలని, సౌకర్యాలు పెంచాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.