దేశవ్యాప్తంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను భారీగా పెంచిన రైల్వే..

ఇండియన్ రైల్వేస్ ప్లాట్‌ఫామ్ టికెట్‌ను భారీగా పెంచింది. ఇప్పటి వరకూ రూ.10గా ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్‌ను రూ.30కి పెంచింది. ఈ టికెట్ తీసుకున్న వాళ్లు రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్లాట్‌ఫామ్ టికెటే కాదు.. లోకల్ రైళ్ల టికెట్లను కూడా భారీగా పెంచింది ఇండియన్ రైల్వేస్‌. లోకల్ రైళ్లలో ఇక నుంచి కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. కరోనా మహమ్మారి సమయంలో అనవసర ప్రయాణాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే ఛార్జీలను పెంచినట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం కోసమే తాత్కాలికంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇలా చేయడం కొత్తేమీ కాదని, చాలా ఏళ్లుగా చేస్తూనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లనే నడుపుతోంది. ఇప్పటి వరకూ 65 శాతం రైళ్లు మళ్లీ పట్టాలెక్కినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.