భివాండీ ఘటనలో 33కి చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర థానేలోని భీవండి నగరంలో సోమవారం మూడంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 33 కి పెరిగిందని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బుధవారం తెలిపింది.

మంగళవారం అర్ధరాత్రి శిథిలాల కింది నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని అధికారులు తెలిపారు. గత 30 గంటలుగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 30 మందిని సురక్షితంగా వెలికితీశారు. మరో 10 మంది శిథిలాల కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న మరో భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. అది కూడా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. దాదాపు 40 కుటుంబాలు అందులో నివాసముంటున్నాయి.