వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద మూడు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆదివారం మూజువాణి ఓటుతో ఆమోదముద్రవేసింది. అంతకుముందు సభలో రైతులకు నష్టం చేకూర్చేలా బిల్లు ఉందంటూ విపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. దాదాపు 14 విపక్ష పార్టీలు ముక్త కంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బిల్లుపై రచ్చ జరిగింది.

కొందరు బిల్లుల ప్రతులను చింపేసి విసిరేశారు. మరికొందరు డిప్యూటీ చైర్మన్ మైక్‌ను లాగేందుకు ప్రయత్నించారు. గందరగోళం మధ్య సభను డిప్యూటీ చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోద ముద్రవేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.