భారత ఒలింపిక్ బృందంతో రాష్ట్రపతి భవన్ లో రామ్ నాథ్ కోవింద్ భేటీ

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందం గత రికార్డును మెరుగుపర్చుతూ 7 పతకాలతో తిరిగొచ్చింది. అందులో నీరజ్ చోప్రా సాధించిన అథ్లెటిక్ స్వర్ణం కూడా ఉంది. ఈ నేపథ్యంలో, భారత ఒలింపిక్ బృందంతో రాష్ట్రపతిభవన్ లో దేశ ప్రథమపౌరుడు రామ్ నాథ్ కోవింద్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో అథ్లెట్లకు అల్పాహార విందు (హై టీ కార్యక్రమం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు.

రామ్ నాథ్ కోవింద్, వెంకయ్య భారత అథ్లెట్లను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. భారత ఒలింపియన్ల ప్రదర్శన పట్ల యావత్ భారతావని గర్విస్తోందని, దేశానికి వన్నె తెచ్చారని కోవింద్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పతకాలు గెలిచిన నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవి దహియా, భజరంగ్ పునియా, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్, భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు, అమోఘ ప్రదర్శన చేసిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు సహా ఇతర ఒలింపియన్లు పాల్గొన్నారు.