ఫ్రాన్స్ నుంచి భారత్‌కి చేరిన రఫేల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లో మొదటి విడతగా ఐదు ఫైటర్ జెట్లు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో 3.15 సమయనికి గమ్యానికి చేరుకున్నాయి. భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా ఎయిర్ బేస్‌లో ఈ ఫైటర్ జెట్లకు స్వాగతం పలికారు. ఫ్రాన్స్ నుంచి భారత్ వచ్చే సమయంలో 30 అడుగుల ఎత్తులో ఎగురుతూ రఫేల్ యుద్ధ విమానాలు ఇంధనం నింపుకుంటున్న ఫొటోలను కూడా భారత వైమానిక దళం అధికారిక ట్విటర్ ఖాతాలో విడుదల చేసింది.

ఏరో లీడర్(రఫేల్‌ను నడుపుతున్న పైలెట్లు)లకు ఐఎన్ఎస్ కోల్‌కతా స్వాగతం పలికింది. మీరు ఘనంగా ఆకాశం అంచులను తాకాలని, మీ ప్రయాణం, లాండింగ్ సాఫీగా సాగాలని ఆకాంక్షించింది.

ఫ్రాన్స్ నుంచి వస్తూ మధ్యలో యూఏఈలో ఆగిన రఫేల్ యుద్ధ విమానాలు పశ్చిమ అరేబియా సముద్రంలో మోహరించిన నావికాదళం యుద్ధనౌక ఐఎన్ఐస్ కోల్‌కతాతో కాంటాక్ట్ ఏర్పరుచుకున్నాయి.

ఈ విమానాలు భారత్ చేరుకోగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస ట్వీట్లు చేశారు.

“యుద్ధ విమానాలు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. భారత్‌లో రఫేల్ యుద్ధ విమానాలు ల్యాండ్ కావడం, మన సైనిక చరిత్రలో కొత్త శకానికి నాంది. బహుముఖ పాత్ర పోషించే ఈ యుద్ధ విమానాలు భారత వైమానిక దళం సామర్థ్యాలను విప్లవాత్మకం చేస్తాయ”ని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.