టీఆర్ఎస్ మేనిఫెస్టో.. డిసెంబర్‌ నుంచి వాటర్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు

గ్రేటర్ టీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ తమ పార్టీ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. డిసెంబర్‌ నుంచి వాటర్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రకటించారు. 98శాతం ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీలో వర్షాలకు దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామని, లాక్‌డౌన్‌ సమయంలో మోటార్‌ వాహనాల పన్ను రద్దు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌ గొప్ప చారిత్రక నగరమని, దేశంలో హైదరాబాద్‌ నిజమైన కాస్మోపాలిటన్‌ సిటీ అన్నారు. హైదరాబాద్‌ అందమైన పూల బొకేలాంటి నగరం. జంట నగరాల్లో ఇప్పుడు నీటి కొరత లేదు. హైదరాబాద్‌కు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాం. త్వరలో సమగ్ర జీహెచ్‌ఎంసీ చట్టాన్ని రూపొందిస్తాం. అధికారుల్లో బాధ్యతను పెంపొందించేలా నూతన చట్టానికి రూపకల్పన చేస్తాం. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయి” అని పేర్కొన్నారు.