ఉసూరుమంటున్న ఉన్నత విద్య!

*దిగజారుతున్ననాణ్యత, ప్రమాణాలు
* ప్రభుత్వ వర్శిటీల్లో అధ్యాపకుల కొరత
* మారని కోర్సులతో చేరని విద్యార్థులు
* పట్టంచుకోని వైకాపా ప్రభుత్వం

క్లాసులో పాఠం చెప్పాల్పిన మాస్టారు కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతుంటే ఏమవుతుంది?
పిల్లల చదువు చట్టుబండలవుతుంది!
జగన్‌ ప్రభుత్వం హయాంలో ఉన్నత విద్య పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది.
నానాటికి తీసికట్టు… అన్నట్టుగా విద్యా ప్రమాణాలు దిగజారిపోతుంటే, తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్న మాస్టారిలాగే ఏమీ పట్టకుండా బాధ్యతా రహితంగా కాలక్షేపం చేస్తోంది.
ఇందుకు తాజాగా జాతీయ స్థాయిలో వెలువడిన ర్యాంకింగులే ప్రత్యక్ష సాక్ష్యం.
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ ఐ ఆర్‌ ఎఫ్‌) వెలువరించిన నివేదికలోని అంశాల కేసి ఓసారి దృష్టి సారిస్తే… వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య నిర్వాకం, ఉన్నత విద్యా సంస్థల దిగజారుడుతనం ఇట్టే అర్థమవుతాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ, దేశవ్యాప్తంగా ఉండే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి అనేక అంశాలను మదింపు చేసి ఏటా ర్యాంకింగులను వెలువరిస్తూ ఉంటుంది. వీటిని బట్టి ఏ రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం ఉత్తమమైనదో తెలుసుకోవచ్చు. ఈ ర్యాంకింగులను బట్టే ఆయా సంస్థల్లో చేరడానికి విద్యార్థులు ఉవ్విళ్లూరుతారు. అలా తాజాగా వెలువరించిన ర్యాంకింగులలో మొదటి పది స్థానాల్లో రాష్ట్రం నుంచి ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కానీ, యూనివర్శిటీ కానీ లేదంటే పరిస్థితి వేరే చెప్పక్కరలేదు. అంతేకాదు విడివిడిగా ఆయా విద్యాసంస్థల ర్యాంకింగులు పరిశీలించినా అవన్నీ అంతకంతకు దిగజారిపోవడం ఆందోళన కలిగించే అంశమే. ఉదాహరణకు వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) ఓవరాల్‌ ర్యాంకింగుల్లో 29వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 76వ స్థానానికి పడిపోయింది. మరో ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ మొదటి 100 ర్యాంకుల్లో లేనేలేదు. విశ్వవిద్యాలయాల విభాగంలో కూడా ఏయూ ర్యాంకు 36 నుంచి 43కి జారిపోయింది. ఇంజినీరింగ్‌ కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన జెఎన్‌టీయూలు కూడా మొదటి వంద ర్యాంకుల్లో చోటు సంపాదించలేకపోయాయి.
* జగన్‌ మాటలు నీటి మూటలు…
ఉన్నత విద్యకు సంబంధించి వైకాపా అధినేతగా పాదయాత్రల సమయంలో జగన్‌ చెప్పిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో అందుకు తగినట్టుగా ఏం చేశారనేది పరిశీలిస్తే… ప్రగల్భాలు పలకడం తప్ప పని చేయడం ఈ ప్రభుత్వానికి చేతకాదనేది తేటతెల్లమవుతుంది.
2019లో జగన్‌ ”ఏపీకి ఆంధ్రాయూనివర్శిటీ ఓ గర్వకారణం. ఎందరో మేధావుల్ని అందించిన ఇది దేశంలో 14వ స్థానంలో ఉండడం అసంతృప్తిని కలిగిస్తోంది” అంటూ వ్రాక్కుచ్చారు. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఏయూ స్థాయిని పెంచడానికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందనే భావించారు. కానీ వాస్తవానికి ఏం జరిగింది? వైకాపా ఆధ్వర్యంలో ఏయూ స్థాయి జాతీయ స్థాయిలో 14 నుంచి 43కి పడిపోయింది. ఏయూలో 936 పోస్టులకు కేవలం 216 మందే రెగ్యులర్‌ ఆచార్యులు ఉన్నారు. మరి ఈ నాలుగేళ్లలో పోస్టుల భర్తీకి కానీ, ప్రమాణాల పెంపు దిశగా కానీ సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదనేది నిర్వివాదాంశమే.
”దేశంలోని ఏ ప్రాంతంలోని విద్యార్థులైనా ఆంధ్రప్రదేశ్‌ రావాలని ఉవ్విళ్లూరేంత బాగా ఉన్నత విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతాం…” అంటూ ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతుంటారు. కానీ అందుకు తగినట్టుగా కార్యాచరణ లేదని చెప్పడానికి రాష్ట్రంలో దిగజారిపోయిన విద్యాప్రమాణాలే నిలువెత్తు సాక్ష్యం.
*మదింపులో బయటపడిన బండారం
ఎన్‌ ఐ ఆర్‌ ఎఫ్‌ ర్యాంకులు కేటాయించడంలో అనేక అంశాలను మదింపు చేస్తుంది. వీటిలో ఏ ఒక్కటి తీసుకున్నా రాష్టం దిగజారుడుతనమే కనిపిస్తోంది. బోధన, అభ్యాసన, వనరులు, విద్యార్థుల సంఖ్య, అధ్యాపకులు-విద్యార్థుల నిష్పత్తి, పీ హెచ్‌ డీ కలిగి ఉన్న అధ్యాపకులు, ఆర్థిక వనరులు, వినియోగం, ఆన్‌ లైన్‌ విద్య, సదుపాయాలు, మౌలిక వసతులు లాంటి ఎన్నో అంశాలను పరిశీలిస్తుంది. అన్నింటిలోనూ రాష్ట్రంలోని యూనివర్శిటీలు వెనకపడిపోయాయి. కొన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోతుంటే, కొన్ని కోర్సుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు లేరు. ఇక కొత్త కోర్సులు, జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలతో ఒప్పందాలు వంటి కార్యక్రమాలు దాదాపు మృగ్యమే. వర్శిటీల నుంచి పరిశోధన ప్రచురణ ఆశించిన స్థాయిలో లేదు. పేటెంట్లు, పరిశోధన ప్రాజెక్టులు లభిస్తున్న దాఖలాలే లేవు. ఇన్ని పరిమితుల మధ్య ఎలాగోలా ఉన్నత విద్య పూర్తి చేసినా వారికి క్యాంపస్‌ సెలక్షన్లలో ఉద్యోగ అవకాశాలు సైతం మితంగానే ఉంటున్నాయి.
ఇక పరీక్షల విధానంలో కూడా లోపాలు చోటు చేసుకుంటుండడం విద్యార్థులను, తల్లిదండ్రులను కూడా ఆందోళన కలిగిస్తోంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులు రీ వాల్యుయేషన్‌కి వెళుతుంటే వారిలో దాదాపు 40 శాతం మంది ఉత్తీర్ణులవుతుండడం మూల్యాంకన దశలో చోటు చేసుకున్న నిర్లక్ష్యాన్ని చాటి చెబుతోంది. ఇటీవల అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో 53 మంది రీవాల్యుయేషన్‌ కి వెళితే వారిలో 30 మందికి మంచి మార్కులు వచ్చాయి. చాలా వర్శిటీల్లో ఆన్‌ లైన్‌ విధానమే లేదు.
* చేరేవారు కరవు
దిగజారుతున్న ఉన్నత విద్యాప్రమాణాలకు అనుగుణంగానే విద్యార్థుల చేరికలు కూడా నానాటికీ తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 57 యూనివర్శిటీలు ఉన్నాయి. వీటిలో 3 సెంట్రల్‌ యూనివర్శటీలు, 20 అటానమస్‌ ఇనిస్టిట్యూషన్లు, 25 స్టేట్‌ యూనివర్శిటీలు, 4 డీమ్ఢ్‌ యూనివర్శిటీలు, 5 ప్రైవేటు యూనివర్శిటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2022-23 విద్యాసంత్సరంలో సీట్ల భర్తీ కేసి దృష్టి సారిస్తే ఆశ్చర్యపరిచే నిజాలు కనిపిస్తాయి. ఇంజినీరింగ్‌లో మొత్తం 1,57,979 సీట్లు ఉండగా భర్తీ అయినవి కేవలం 1,07,601 మాత్రమే. ఇక ఎంటెక్‌ పరిస్థితి మరీ దారుణం. మొత్తం 21,211 సీట్లకు కేవలం 5,271 సీట్లే భర్తీ అయ్యాయి. అలాగే ఎంబీఏ, ఎంసీఏలలో 48,858 సీట్లకు 33,341 భర్తీ అవడం విద్యాప్రమాణాల దుస్థితిని చాటుతోంది. బీఈడీ పరిస్థితి మరీ ఘోరం. మొత్తం 37,367 బీఈడీ సీట్లుండగా అత్యంత స్వల్పంగా 3231 సీట్లే భర్తీ అయ్యాయి. ఇక పీజీ ఈసెట్‌లో 44,463 సీట్లకు 16,252, డిగ్రీలో 3,46,777 సీట్లకు 1,41,478 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయంటే, వైకాపా ప్రభుత్వం ఉన్నత విద్యను ఎలా గాలికి వదిలేసిందో బోధపడుతోంది.
* సిబ్బంది కొరతతో ఇబ్బంది…
రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో అధ్యాపకుల సమస్య దారుణంగా తయారైంది. పనిచేస్తున్నవారి సంఖ్య కంటే ఖాళీలే అధికంగా ఉన్నాయి. వర్శిటీలన్నీ కేవలం 33 శాతం మందితోనే నడుస్తున్నాయంటే వైకాపా ప్రభుత్వం ఉదాసీనత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. 598 ప్రొఫెసర్ల పోస్టుల్లో 282 ఖాళీలున్నాయి. 1080 అసోసియేట్లకి 889 మంది లేరు. దాదాపు 1691 అసిస్టెంటు ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ట్రిపుల్ ఐటీల్లో 120 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ఇద్దరు, 228 అసిస్టెంటు ఫ్రొఫెసర్లకు 50 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 60 మంది ప్రొఫెసర్లకు ఒక్కరంటే ఒక్కరు కూడా విధుల్లో లేరంటే ఉన్నత విద్యావ్యవస్థ పట్ల వైకాపా ప్రభుత్వం ఎంత దారుణమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తోందో తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో కలిపి మంజూరైన పోస్టులు 3,864 కాగా, ఇప్పుడున్న రెగ్యులర్‌ ఆచార్యులు 1123 మంది మాత్రమే. నాలుగేళ్లుగా పోస్టుల భర్తీపై ప్రకటనలే తప్ప ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కాంట్రాక్టు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. రెండు వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వకపోవడం జగన్‌ ప్రభుత్వ ఉదాసీనతను ఎత్తి చూపిస్తోంది.
* ఆదుకోవడం పోయి ఆరగిస్తే ఎలా?
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం వర్శిటీల్లోని నిధులపై కూడా కన్నేసింది. ఈ నిధులను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలంటూ లాగేసుకుంటోంది. విశ్వవిద్యాలయాలను నిధులిచ్చి ఆదుకోవలసిందిపోయి, విద్యార్థుల ఫీజులు ఇతరత్రా రూపంలో వచ్చే నిధులను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్ లో డిపాజిట్‌ చేయిస్తూ… ఆ సొమ్మును ఇతరత్రా కార్యకలాపాలకు నిర్లజ్జగా వాడుకుంటోంది. ఇప్పటి వరకు వర్శిటీలు దాదాపు రూ. 150 కోట్లను డిపాజిట్‌ చేశాయి. వీటిని తిరిగి ప్రభుత్వం నుంచి తీసుకోలేని పరిస్థితిలో విశ్వవిద్యాలయాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇందువల్ల ఆయా విద్యాసంస్థలు తమ సంస్థాగత వ్యయాలకు నిధులను సమకూర్చుకోడానికి నానా ఇక్కట్లూ పడుతున్నాయి.
ఉదాహరణకు ఏయూలో 4 వేల మంది పెన్షనర్లకు చెల్లించేందుకు ఏటా రూ. 210 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం అన్నింటికీ కలిపి రూ. 200 కోట్లు మాత్రమే ఇస్తోంది. దాంతో ఫీజులు, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నుంచే ఏటా రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసుకోవలసి వస్తోంది. అలాగే అనంతపురం జేఎన్‌టీయూ ఇప్పటికే కార్పొరేషన్‌ లో రూ. 50 కోట్లు, కాకినాడ జేఎన్‌టీయూ రూ. 70 కోట్లు డిపాజిట్‌ చేశాయి. ఇలా వర్శిటీ నిధులను ప్రభుత్వం లాగేసుకుంటుంటే వాటికిక ఆర్థిక పరిపుష్టి ఎలా సాధ్యమన్నది జవాబు లేని ప్రశ్న.
* రాజకీయ క్రీనీడలు…
రాష్ట్రంలో ఉన్నత విద్య అడుగంటి పోడానికి ప్రభుత్వ ఉదాసీనతతో పాటు వైకాపా నేతల రాజకీయ ప్రాపకాలు కూడా కారణమవుతున్నాయి. వర్శిటీలకు వీసీల నియమాకాలతో పాటు, వారి కార్యకలాపాలపై కూడా రాజకీయ క్రీనీడలు అల్లుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వైకాపా నేతల ఆధిపత్యం వల్ల చాలా మంది వీసీలు విద్యాసంస్థల ప్రాంగణాలను రాజకీయ కార్యకలాపాలకు నెలవులుగా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏయూ వీసీ ఛాంబర్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేయడం, మాజీ సీఎం వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలాంటి కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. చదువులకు ఆలవాలమైన విద్యా సంస్థల పరిధిలో రాజకీయ పరమైన కార్యక్రమాలు జరపడం అనుచితమనే మేధావుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నిజమైన విద్యార్హతలు ఉండి కూడా రాష్ట్రంలో వీసీ పోస్టులకు ఎవరూ ముందుకు రాకపోవడం మరింత కలవరపరిచే అంశం.