పోలవరం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం.. జలదిగ్బంధంలో 30 గ్రామాలు

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 26.2 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔట్ ఫ్లో 18 వేల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు నీటిమట్టం పెరగడంతో దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

ఏ.వీరవరం, తొయ్యేరు గ్రామాల మధ్య ఆర్ అండ్ బీ చప్టాలపై నీరు ప్రవహిస్తోంది. దీంతో, రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దండంగా, చినరమణయ్యపేట గ్రామాల మధ్య రహదారిపై సీతపల్లివాగు ప్రవహిస్తోంది. గిరిజనులు తమ గ్రామాల నుంచి నాటు పడవలపై తరలిపోతున్నారు. మరోవైపు పోలవరం వద్ద నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.