కోవిడ్ వారియర్స్ కోసం సల్మాన్ సాయం

కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపం చూపిస్తున్న వేళలో షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది కరోనా విషయంలో అవేర్‌నెస్ కలిగించటంతో పాటు కోవిడ్ అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ మాత్రం రంగంలోకి దిగి మరి సాయం చేస్తున్నారు.

గత సంవత్సరం కోవిడ్ టైంలోనూ తన వంతు సాయంగా భారీ విరాళం ప్రకటించిన సల్మాన్‌ ఖాన్‌… ఈ సారి స్వయంగా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కోవిడ్ వారియర్స్‌ కోసం ప్రత్యేకంగా వంట చేయించి వారికి అందజేస్తున్నారు. ఏదో మనుషులను పెట్టి పని చేయించటం కాదు.. తానే స్వయంగా కిచెన్‌లో ఉండి ఆ పనిని పర్యవేక్షిస్తున్నారు సల్మాన్‌ భాయ్‌.

తన సొంత రెస్టారెంట్ చైన్‌ `భాయ్‌జాన్‌ కిచెన్‌` ద్వారా ఈ సర్వీస్‌ చేస్తున్నారు సల్మాన్‌. రోజు ముంబైలోని 5000 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు భాయ్‌జాన్‌ కిచెన్‌ నుంచి ఫుడ్ అందేలా ఏర్పాట్లు చేశారు. ఇక సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన రాధే మూవీ మే 13న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని సీటీమార్ సాంగ్ ను రీమిక్స్ చేసారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. కోవిడ్‌ సిచ్యుయేషన్‌లో ఈ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.