పోలియో చుక్కలకు బదులుగా శానిటైజర్..

దేశంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ఓ తీవ్రమైన అపశృతి చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించి పిల్లలకు పోలియో చుక్కలకు బదులుగా హ్యాండ్ శానిటైజర్ డ్రాప్స్ వేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఓ అధికారి సోమవారం వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాల్లో కి వెళ్తే .. యవత్మాల్ జిల్లాలోని కప్సికోప్రి గ్రామంలోని భన్ బోరా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జనవరి 31న ఒకటి నుంచి ఐదు ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అయితే 12 మంది పిల్లలకు మాత్రం పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ డ్రాప్స్ వేసినట్టు యవత్మల్ జిల్లా పరిషత్ సీఈవో శ్రీకృష్ణ పంచాల్ తెలిపారు. డ్రాప్స్ తీసుకున్న పిల్లల్లో ఒక్కరు అస్వస్థతకు గురయ్యారనే ఫిర్యాదు వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత పిల్లలకు శానిటైజర్ డ్రాప్స్ వేసిన విషయం వెలుగు చూసిందన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారులంతా చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం చిన్నారులు యవత్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వెల్లడించారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో భన్బోరా పీహెచ్సీలో ఓ డాక్టర్ ఓ అంగన్వాడీ కార్యకర్త ఓ ఆశా వాలంటీర్ ఉన్నారని.. దీంతో ఆ ముగ్గురు హెల్త్ వర్కర్లను సస్పెండ్ చేసేందకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.