సుబ్రతారాయ్ కు సెబీ షాక్.. సుప్రీంలో పిటిషన్‌

ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా భారీ మొత్తంలో నిధులు సమీకరించినట్టు అభియోగాలెదుర్కొంటున్న సహార గ్రూపునకు సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఇండియా) షాకిచ్చింది. గతంలో న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా డబ్బులు చెల్లించాలని కోర్టులు ఇచ్చిన ఆదేశాలను సహారా గ్రూపునకు చెందిన రెండు సంస్థలు ఉల్లంఘించాయని పేర్కొంటూ సుప్రీంకోర్టును సెబీ ఆశ్రయించింది. ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.62,602.90 కోట్లను సహారా గ్రూప్‌ చెల్లించేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయ స్థానాన్ని సెబీ కోరింది. ఒకవేళ డబ్బులు చెల్లించడంలో విఫలమైతే సహరా గ్రూపు ఛైర్మన్‌ సుబ్రతా రాయ్‌ను అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ‘కోర్టులు జారీ చేసిన వివిధ ఆదేశాలను సహారా గ్రూపునకు చెందిన సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐఆర్‌ఈసీఎల్‌), సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌ఐసీఎల్‌) సంస్థలు పూర్తిగా ఉల్లంఘించాయి. ప్రజల దగ్గర నుంచి సేకరించిన డిపాజిట్లను వడ్డీతో కలిపి చెల్లించమని ఆదేశించగా.. దానిని పాటించలేద’ని సెబీ తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ నవంబరు 18న ఓ దరఖాస్తును సమర్పించింది. డిపాజిట్‌దార్లకు న్యాయం జరిగేలా ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉన్న మిగులు బకాయి రూ.62,602.90 కోట్లను వెంటనే సెబీ- సహారా రిఫండ్‌ ఖాతాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోర్టును సెబీ కోరింది. ఒకవేళ డబ్బులు చెల్లించని పక్షంలో వాళ్లను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని అడిగింది.