గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీ తొలగింపు.. తమిళిసైకి అదనపు బాధ్యతలు

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కి ఎల్జీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కొత్త లెఫ్టినెంట్ గవర్నర్​ను నియమించేవరకు తమిళిసై అదనపు బాధ్యతలు చేపడుతారని పేర్కొంది. నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తొలగింపు చర్చనీయాంశమైంది.

కిరణ్ బేడి తొలగింపు

త్వరలో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌ను మార్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు అంశాలపై కిరణ్ బేడీ, నారాయణస్వామి మధ్య కొనసాగిన విభేదాల వల్ల మరోసారి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు లాభపడకుండా ఉండేందుకే కేంద్రం ఈ దిశగా అడుగులు వేసిందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల మీద పట్టున్న తెలంగాణ గవర్నర్ తమిళి సైకి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు అప్పగించడం కూడా ఆసక్తిగా మారింది.

మైనారిటీలో నారాయణస్వామి సర్కారు

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ సర్కారు మైనారిటీలో పడింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు మరో ఎమ్మెల్యే ఎ.జాన్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. జనవరిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎ.నమశ్శివాయమ్‌, ఇ.తీప్పయిన్‌జన్‌ రాజీనామా చేశారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలతో ఎమ్మెల్యే ఎన్‌.ధనవెలోయును కాంగ్రెస్‌ డిస్‌క్వాలిఫై చేసింది. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్‌ సీనియర్ లీడర్ మల్లాడి కృష్ణారావు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కిరణ్‌ బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని కోరుతూ సీఎం నారాయణస్వామితో కలిసి ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కృష్ణారావు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. 2016లో పుదుచ్చేరిలో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ 15 సీట్లు, దాని భాగస్వామ్మ పార్టీ డీఎంకే 4 సీట్లు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే సపోర్ట్‌ తో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.