ఆక్సిజన్‌ను విమానాల్లో పంపండి.. మోదీని కోరిన మహారాష్ట్ర సీఎం.. కేంద్రం ఆమోదం

మహారాష్ట్రలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, కాబట్టి వీలైతే వాయుమార్గం ద్వారా ఆక్సిజన్‌ను పంపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్రమోదీని కోరారు. కొవిడ్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిన్న వర్చువల్‌గా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాలకు సరిపడా ఆక్సిజన్ లేదని, కాబట్టి వీలుంటే విమానాల ద్వారా ఆక్సిజన్‌ను తరలించాలని కోరారు. అలాగే, సరిపడా కొవిడ్ వ్యాక్సిన్లను పంపాలని కోరారు. రెమ్‌డెసివిర్ ఔషధానికి కూడా విపరీతమైన కొరత ఉందని, వాటిని దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దూర ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసే కంటే పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించే వీలుంటే చూడాలని కోరారు. అలాచేస్తే సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అలాగే, వాయుమార్గం ద్వారా ఆక్సిజన్‌ను తెప్పించే వీలు లేకుంటే కనీసం ఖాళీ ట్యాంకులను అయినా రీఫిల్లింగ్ ప్లాంట్లకు విమానంలో తరలించాలని ఉద్ధవ్ ప్రధానిని కోరారు.

సీఎం ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించిందని, ఖాళీ ట్యాంకులను రీఫిల్లింగ్ ప్రాంతాలకు విమానాల్లో తరలించేందుకు సానుకూలంగా స్పందించిందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. కాగా, మహారాష్ట్రలో రోజుకు 1,550 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం కాగా, ప్రస్తుతం సుమారు 350 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుతోంది.