పుష్ప పల్లకీలో శివయ్య విహారం

శ్రీశైలం: భక్తజన బాం ధవుడు, అభిషేక ప్రియుడు పుష్పపల్లకీలో విహరించారు. సుమధుర పుష్పాలంకృతమైన పల్లకీలో దేవదేవులు దివ్య మనోహర శోభతో దేదీప్యమానంగా దర్శనమివ్వగా, భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేళ సుందర దృశ్యం శ్రీగిరి పురవీధుల్లో సాక్షాత్కరించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరో రోజు మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వార్లు పుష్పపల్లకీలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. మంగళవాయిద్యాలు, కళాకారుల నృత్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పపల్లకీ వద్దకు చేర్చారు. దేవదేవులను పల్లకీలో వేంచేబు చేసి మంగళహారతులు సమర్పించారు. ఈవో కె.ఎస్‌.రామారావు, అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు శ్రీగిరి పుర వీధుల్లో రమణీయంగా గ్రామోత్సవం జరిగింది.

భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరి

శ్రీశైల మహాక్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోతోంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి పురవీధులు రద్దీతో కళకళలాడుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్‌ చర్యల్లో భాగంగా వాహనాలను పార్కింగ్‌ ప్రదేశాల్లోకి మళ్లిస్తున్నారు. క్యూలైన్ల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. పాదయాత్రగా శివదీక్షా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు.