శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవ

తిరుమలేసుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవారి ఆలయంలో ఆప్రికాట్‌, పిస్తా, అత్తితో ప్రత్యేకంగా రూపొందించిన మాలలతో స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ గోవిందాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపనతిరుమంజనంలో వివిధ రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అభయమిచ్చారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తుండగా, ప్రత్యేక మాలలను అలంకరించారు. ఆప్రికాట్‌, పిస్తా, అత్తి, యాలకులు, మొగిలిపూలు, వడ్లగింజలు, నల్ల పవిత్రాలతో తయారు చేసిన మాలలు, కిరీటాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రంగనాయకుల మండపాన్ని ఆర్కిడ్లు, కట్ రోజాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.ఈ కార్యక్రమంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్ పాల్గొన్నారు.