జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యచరణతో దద్దరిల్లిన సామాజిక మాధ్యమాలు

• రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్
• సంయుక్తంగా పాల్గొన్న జనసేన – టీడీపీ నేతలు
• గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అంటూ నినదించిన నాయకులు
• గుంతలు చూపుతూ, ప్రజలకు అవగాహక కల్పిస్తూ సాగిన కార్యక్రమం
జనసేన – తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా చేపట్టిన మొదటి ఉమ్మడి కార్యచరణ గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది డిజిటల్ క్యాంపెయిన్ దెబ్బకి సామాజిక మాధ్యమాలు దద్దరిల్లాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలసి రోడ్డెక్కారు. గోతుల మధ్య ఉన్న రహదారులను ఎత్తి చూపుతూ వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. రహదారుల మీద గుంతల పరిమాణం తెలిపేలా వాటి చుట్టూ వైసీపీ రంగులతో ముగ్గులు వేస్తూ.. నీటితో నిండిన గోతుల్లో పడవలు, చేపపిల్లలు వదులుతూ, గోతుల రహదారుల మధ్య నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారు. రహదారుల దుస్థితిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. 13 ఉమ్మడి జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో జనసేన – టీడీపీ శ్రేణులు ఇరు పార్టీల ఆదేశాలను పాటిస్తూ ప్రతి గుంతను ఫోటోలలో బంధించి సామాజిక మాధ్యామాల్లో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సైతం పాల్గొన్నారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సంయుక్త కార్యచరణ దెబ్బకి ప్రధాన సామాజికమాధ్యమాల్లో రాష్ట్ర రహదారుల అంశం టాప్ ట్రెండింగ్ కావడం గమనార్హం. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరులతో పాటు రాయలసీమ జిల్లాల్లో రోజంతా సాగిన ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, జిల్లా, నగరాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. మండల కమిటీల ఆధ్యర్యంలోనూ ఉమ్మడి కార్యచరణ సాగింది.

కొన్ని చోట్ల ఏకంగా ఇరు పార్టీల శ్రేణులు శ్రమదానం చేసి రహదారులపై గుంతలను పూడ్చేశాయి. మాజీ మంత్రులు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.