గుంతల రాజ్యంలో ప్రజల హాహాకారాలు!

* రోడ్లు వేయలేక వైసీపీ ప్రభుత్వం చోద్యం
* అయిదేళ్లలో సమస్యను పట్టించుకున్నదే లేదు
* సెస్ డబ్బును రోడ్లకు వాడలేదు
* కేంద్రం నిధులు, రుణాలు కూడా అంతే

రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ బీ రహదారుల విస్తీర్ణం ఇది..
* రాష్ట్ర రహదారులు 13,500 కి.మీ.
* జిల్లా రహదారులు 32,725 కి.మీ.

మొత్తం 46,225 కి.మీ.
* వీటిలో నాలుగు వరుసలు 720 కి.మీ. (1.56%)
* పది మీటర్ల వెడల్పుండే రెండు వరుసలు: 519 కి.మీ. (1.12%)
* ఏడు మీటర్ల వెడల్పుండే రెండు వరుసలు: 9,510 కి.మీ. (20.57%)
* ఏక వరుస: 35,476 కి.మీ.(76.75%)
• వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి మూడేళ్ళూ రహదారులను పట్టించుకోలేదు. తర్వాత నుంచి రోడ్లపై దృష్టి పెట్టినా పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించలేదు.
* జూన్‌ నుంచి నవంబరులోపు వర్షాలకు దెబ్బతిన్న రహదారులను డిసెంబరు నుంచి జూన్‌లోపు పూడ్చాలి. రోడ్డంతా ఎక్కువ గుంతలు ఉంటే, దానిని పునరుద్ధరించాలి. రాష్ట్రంలో ఇదేమీ జరగడం లేదు. పలు ప్రాజెక్టులు, నిధుల కింద చేపట్టిన రహదారులకు బిల్లుల చెల్లింపులు జరక్కపోవడంతో.. వాటిలో పనులు పూర్తిస్థాయిలో జరగడంలేదు. కనీసం మరమ్మతులు సైతం చేయడం లేదు. ఓ ప్రాజెక్టు కింద మంజూరైన రోడ్డులో మరమ్మతులు చేస్తే అందుకు అయ్యే అదనపు వ్యయాన్ని ఇచ్చే అవకాశం లేకపోవడంతో గుత్తేదారులు వాటి మరమ్మతులు చేయడం లేదు.
* న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రాజెక్టులో తొలిదశలో రూ.3,013 కోట్లతో 1,244 కి.మీ.రహదారులను విస్తరించాలని భావించారు. గుత్తేదారులతో రెండేళ్ల కిందట ఒప్పందం జరిగింది. అయితే బ్యాంకు రుణం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం ఎలా చెల్లిస్తారనేది తేలకపోవడంతో గుత్తేదారులు తొలుత పనులు చేయలేదు. గత ఏడాది బ్యాంకు రూ.230 కోట్లు రుణం విడుదల చేసినా, ప్రభుత్వం అందులో రూ.100 కోట్లు చెల్లించి, మిగిలినవి దారి మళ్లించింది.
• కేంద్ర రహదారి నిధి (సీ ఆర్‌ ఎఫ్‌) కింద రాష్ట్రంలో 1,100 కి.మీ. మేర రహదారుల విస్తరణ, పటిష్ఠ పరిచే పనులు మంజూరయ్యాయి. కేంద్రం ఏటా రూ.350 కోట్లు సీ ఆర్‌ ఎఫ్‌ కింద రీయింబర్స్‌ చేస్తుండగా.. రూ.1,500 కోట్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అక్కడక్కడే పనులు జరుగుతున్నాయి. వీటిలో కూడా మరమ్మతులు చేయడం లేదు. కేంద్రం తిరిగి చెల్లిస్తుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం సీ ఆర్‌ ఎఫ్‌ పనులకు ముందుగా డబ్బు చెల్లించలేకపోతోంది.
* ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించి, ప్లాన్‌ వర్క్స్‌ కింద మంజూరైన రహదారులు 1,200 కి.మీ.వరకూ ఉన్నాయి. వీటికి సక్రమంగా చెల్లింపులు లేకపోవడంతో ఈ పనులు అరకొరగానే సాగుతున్నాయి.
*మొత్తం కాదు.. ఐ-ప్యాక్‌ చెప్పిన రోడ్లే
వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక 2021వరకు రోడ్ల పునరుద్ధరణకు నిధులివ్వలేదు. గత ఏడాది రూ.2 వేల కోట్ల బ్యాంకు రుణంతో 7,900 కి.మీ.లను విస్తరించారు. ఈసారి మరో 6,180 కి.మీ. రూ.1,700 కోట్లతో విస్తరించేందుకు అనుమతులు కోసం పంపితే.. ప్రభుత్వం మాత్రం ప్రశాంత్‌ కిషోర్‌ బృందం (ఐ-ప్యాక్‌) సూచించిన నియోజకవర్గానికి అయిదేసి రోడ్లనే పునరుద్ధరించాలని ఆదేశించడం విశేషం.
*పన్ను వసూలు చేసినా… రోడ్లు బాగు పడవు
• రోడ్ల కోసం నిధులు ఖర్చు పెట్టేందుకు ఈ ప్రభుత్వానికి ఎలాగూ మనసు రావడం లేదు. కనీసం రోడ్ల అభివృద్ధి పేరిట వాహనదారుల నుంచి ఏటా పన్ను రూపంలో రూ.600 కోట్లు వసూలు చేస్తున్నా.. వాటితో కనీసం గుంతలు ఎందుకు పూడ్చడం లేదు. రహదారి అభివృద్ధి సెస్సు కింద వసూలు చేస్తున్న సొమ్మును కూడా ఖర్చు చేయడం లేదు. రహదారుల అభివృద్ధి, మరమ్మతుల కోసమని చెబుతూ వైకాపా ప్రభుత్వం 2020, సెప్టెంబరులో రహదారి అభివృద్ధి పన్ను విధించింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి అదనంగా పన్ను రూపంలో వసూలు చేయడం ఆరంభించారు. నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.600 కోట్లు ఈ పన్ను ద్వారా వస్తోంది. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.1,800 కోట్లు వసూలైంది. ఈ సొమ్మంతా ఏటా క్రమం తప్పకుండా వెచ్చిస్తే రోడ్లపై గుంతలు లేకుండా చేయొచ్చు. రహదారుల నిర్వహణ పనులకూ నిధుల కొరత ఉండదు.
* రాష్ట్రంలో అత్యంత ఘోరంగా మారిన 7,649 కి.మీ. మేర రహదారులను పునరుద్ధరించేందుకు రూ.2,205 కోట్ల వ్యయమవుతుందని రెండేళ్ల కిందట ప్రభుత్వం అంచనా వేసింది. దీనికోసం రహదారి అభివృద్ధి పన్నును హామీగా చూపించి రూ.2 వేల కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. అయినా గుత్తేదారులకు వైకాపా ప్రభుత్వంపై నమ్మకం కలగలేదు. ఆ రుణాన్ని ప్రభుత్వం వాడేసుకుంటుందని, పనులు చేశాక బిల్లులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తుందన్న ఉద్దేశ్యంతో గుత్తేదారులు బిడ్లు వేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో బ్యాంకు నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తేగానీ, గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రాలేదంటే.. జగన్‌ సర్కారుపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. బ్యాంకు రుణంలో రూ.1,900 కోట్ల మేర గుత్తేదారులకు చెల్లింపులు చేసినా, ప్రభుత్వం మాత్రం తన వాటా రూ.205 కోట్లలో చెల్లింపులేమీ చేయలేదు. దీంతో బ్యాంకు తన రుణంలో మిగిలిన రూ.100 కోట్లను నిలిపివేసింది. చివరకు ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లను ఒప్పించి మిగిలిన రుణాన్ని విడుదల చేసేలా చూశారు. ఇదంతా జరిగి ఏడాదయ్యాక రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇటీవల విడుదల చేసింది. పన్ను హామీతో రుణం తెచ్చి ఒకసారి రోడ్ల పనులు చేయించినా, అదే పన్నుతో గుత్తేదారులకు ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లింపులు కూడా చేయలేకపోయింది.
*కేంద్రం నుంచి నిధులు వచ్చినా అంతే
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీ ఆర్‌ ఐ ఎఫ్‌) కింద రాష్ట్రవాటా నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.. మీరు చెల్లించి, రీయింబర్స్‌మెంట్‌ తీసుకోవాలని కేంద్రం చెబుతుంటే, వైకాపా ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేకపోతోంది. పూర్తిస్థాయిలో చెల్లించకుండా, కేంద్రనిధులు వినియోగించుకోలేక చోద్యం చూస్తోంది.
* నెల్లూరు జిల్లాలో జలదంకి నుంచి తెల్లపాడు వరకు సీ ఆర్‌ ఐ ఎఫ్‌ కింద రూ.12 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు రెండేళ్లుగా ఆగిపోయాయి. గుత్తేదారుకు రూ.4కోట్ల బకాయిలు ఉండటంతో పనులు నిలిపేశారు. ఈ రహదారిలో కల్వర్టు పనులనూ మధ్యలోనే ఆపేశారు.
పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం వసూలు చేసే రహదారి సెస్‌లో.. ఆయా రాష్ట్రాలకు ఏటా కేంద్ర రహదారి మౌలికవసతుల నిధి (సీ ఆర్‌ ఐ ఎఫ్‌) కింద రోడ్ల పనులకు నిధులు మంజూరుచేస్తారు. వీటితో రోడ్లలో ప్రమాదాల నివారణ పనులు, వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణ పనులు చేపడతారు. ఈ నిధి కింద మన రాష్ట్రానికి ఏటా సగటున రూ.350 కోట్లు వస్తుంది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించి, వాటి వినియోగ ధ్రువీకరణ పత్రం (యూసీ) అందజేస్తే.. కేంద్రం ఆ నిధులను రీయింబర్స్‌ చేస్తుంది. గత కొన్నేళ్లుగా రూ.2వేల కోట్ల విలువైన సీ ఆర్‌ ఐ ఎఫ్‌ పనులు మంజూరయ్యాయి. కొన్ని నెలలుగా అన్ని పనులూ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
* ఈ పనులు చేసిన గుత్తేదారులకు పెద్దఎత్తున బకాయిలు చెల్లించాలి. 2022-23లో ఈ నిధి కింద రాష్ట్రప్రభుత్వం రూ.69కోట్లే గుత్తేదారులకు చెల్లించింది. ఈసారి రూ.180 కోట్లు చెల్లించి, కేంద్రం నుంచి రూ.280 కోట్లను తీసుకుంది. మిగిలిన రూ.100 కోట్లు ఇంకా గుత్తేదారులకు ఇవ్వలేదు. గుత్తేదారులకు రూ.550 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి.
* రాష్ట్రప్రభుత్వ తీరుతో విసిగిపోయిన గుత్తేదారులు.. ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏపీలో సీ ఆర్‌ ఐ ఎఫ్‌ కింద పనులు చేసినా, చెల్లించట్లేదని, కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఏపీలో ఉన్న సీ ఎఫ్‌ ఎం ఎస్‌ కి బదులు, కేంద్రానికి చెందిన పీ ఎఫ్‌ ఎం ఎస్‌ ద్వారా చెల్లించాలని కోరారు.
*విదేశీ బ్యాంకు రుణమిచ్చినా రోడ్ల గతి ఇంతేనా
మండల కేంద్రాలను అనుసంధానించే, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి కలిపే రోడ్లను రెండు వరుసలుగా విస్తరించేందుకు న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌ డీ బీ) రూ.6,400 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేసింది. ఇందులో 70 శాతం ఎన్‌ డీ బీ రుణంగా ఇస్తుండగా, మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. తొలి దశలో 1,243 కి.మీ విస్తరణ, 204 వంతెనలకు కలిపి రూ.3,013.86 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో ఎన్‌డీబీ రుణం రూ.2,109.86 కోట్లు, మిగిలిన రూ.904 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. ఆయా జిల్లాల్లోని పనులన్నీ కలిపి ఓ ప్యాకేజీగా చేసి టెండర్లు నిర్వహించారు. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుత్తేదారులకు ఈ పనులు అప్పగించారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికీ రాష్ట్రమంతా కలిపి సగటున 19.69 శాతం పనులు మాత్రమే జరిగాయి. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో కనీసం 10 శాతం పనులు కూడా జరగలేదు.
* ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి చెల్లింపుల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో గుత్తేదారులు వేగంగా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎన్‌ డీ బీతో జరిగిన ఒప్పందం ప్రకారం.. బ్యాంకు కొంత మొత్తం ఇచ్చిన ప్రతిసారి దానికి 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం కూడా వెచ్చించాల్సి ఉంది. ఈ నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని ఎన్‌ డీ బీ సూచించింది. దీనికి ప్రభుత్వం అంగీకరించడంతో ఎన్‌ డీ బీ తొలివిడతగా రూ.230 కోట్లు గత ఏడాది జులైలో విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.90 కోట్లు జత చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు బ్యాంకు రుణం వాటాలో గుత్తేదారులకు ప్రభుత్వం రూ.200 కోట్ల మేరకే చెల్లించింది. రూ.70 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేసి చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నాయి.