స్పేస్‌ స్టేషన్‌కి రాకెట్‌ని ప్రయోగించిన SpaceX

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా వ్యోమగాములతో చేపట్టనున్న ఆరు నెలల మిషన్‌ను స్పేస్‌ ఎక్స్‌ విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం రాత్రి 9.03 గంటలకు భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7.33 గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరల్‌లోని నాసా కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుండి బయలు దేరింది. ప్రముఖ స్పేస్‌వాకర్‌, భవిష్యత్తులో నాసా చేపట్టనున్న చంద్ర మిషన్‌కు ఎంపికైన ఇద్దరు యువసిబ్బందితో కలిపి మొత్తం నలుగురు వ్యోమగాములు ఫాల్కన్‌ 9 రాకెట్‌లో ఉన్నారు. స్పేస్‌ ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ ఎండ్యూరెన్స్‌ మొదటి ఫ్లైట్‌ కావడం గమనార్హం. సిబ్బందితో అంతరిక్ష ప్రయాణం చేపట్టడం స్పేస్‌ఎక్స్‌కి ఇది నాలుగవ ప్రయోగం కానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. నాసా వ్యోమగాములైన రాజాచారి, టామ్‌ మార్ష్‌బర్న్‌, కైలాబారన్‌, యూరోపియన్‌ స్పేస్‌ ఏజన్సీకి చెందిన మథియాస్‌ మౌరర్‌లు సుమారు 22 గంటల అనంతరం భూమికి 400 కి.మీ ఎత్తుతో ఉన్న అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి కక్ష్యలో ఉన్న ప్రయోగశాలలో ఆరునెలల ప్రయోగాన్ని ప్రారంభిస్తారు. నాసా,స్పేస్‌ ఎక్స్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని మూడవ పూర్తిస్థాయి ఆపరేషనల్‌ ”క్రూ-3”గా పేర్కొంది. గత ఏడాది మేలో చేపట్టిన రెండు ట్రయల్‌ రన్‌ల అనంతరం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 31న చేపట్టాల్సిన ఈ ప్రయోగం అననుకూల వాతావరణ పరిస్థితులతో వాయిదా వేయాల్సివచ్చింది.