భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన శ్రీలంక

భారత్ లో కొవిడ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని అనేక దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించగా, తాజాగా ఆ జాబితాలో పొరుగునే ఉన్న శ్రీలంక కూడా చేరింది.

భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు శ్రీలంకలో దిగేందుకు ఇకపై అనుమతించబోమని శ్రీలంక పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. భారత్ లో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. చిన్న ద్వీపదేశం అయిన శ్రీలంకలో గత 5 రోజులుగా 2 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.