భవిష్యత్తు పోరాటాలకు బలమైన బాటలు

* పీఏసీ సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన అజెండా
* పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా భవిష్యత్తు కార్యాచరణ
* నాలుగు తీర్మానాలకు ఏకగ్రీవంగా ఆమోదం
* మీడియా సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో ప్రజా సమస్యలు… వాటి పరిష్కారానికి జనసేన పార్టీ భవిష్యత్తుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఉదయం 11 గంటలకు మొదలైన పీఏసీ సమావేశం సుదీర్ఘంగా నాలుగున్నర గంటలపాటు సాగిందని వెల్లడించారు. ఈ సమావేశం నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించిందని అన్నారు. సోమవారం మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఇప్పటి వరకు పార్టీ చేసిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించాం. పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు ఉండాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. నాలుగు విడతల్లో జరిగిన జనవాణి కార్యక్రమంలో అనేక అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలపై అనేక మంది బాధితులు ఫిర్యాదు చేశారు. వచ్చిన అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రపై చర్చించాం. భవిష్యత్తులో రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలి. ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరడానికి చాలా మంది సీనియర్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించమని అధ్యక్షులు వారు చెప్పారు.
* నాలుగు తీర్మానాలకు ఆమోదం
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షులతో కూలంకషంగా చర్చించి నాలుగు తీర్మానాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాం. దివ్యాంగులకు సామాజిక భద్రతలో భాగంగా అందాల్సిన పెన్షన్లు, ఉపకరణాలను ఈ ప్రభుత్వం దూరం చేస్తోంది. దివ్యాంగుల ఆస్తులను సైతం ఆక్రమించుకొని వేధిస్తోన్న ఉదంతాలు జనవాణి ద్వారా వెలుగులోకి వచ్చాయి. పార్టీ పరంగా వారి అండగా ఉండాలనే ఉద్దేశంతో “దివ్యాంగుల సంక్షేమం సామాజిక భరోసా జనసేన బాధ్యత” అనే తీర్మానం చేశాం. వక్ఫ్ ఆస్తులను వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటున్నారు. వారి గెలుపుకు అండగా ఉన్న వర్గాలనే దోచుకుంటున్నారు. ముస్లిం సోదరులకు అండగా నిలబడాలని “వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ… వెనుకబడ్డ ముస్లింల ఆర్థిక పరిపుష్టి” అనే అంశం తీర్మానంలో పెట్టాం. “అధికారానికి దూరంగా ఉన్న కులాలకు నిజమైన రాజకీయ సాధికారత”తోపాటు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సహజ వనరులను దోచుకుంటున్న వైసీపీ నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలని “వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్” తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామ”ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *