భారత్ బంద్‌కు వామపక్షాల మద్దతు

రైతు సంఘాలు ఈనెల 8న ‘భారత్ బంద్‌’కు ఇచ్చిన పిలుపునకు వామపక్ష పార్టీలు శనివారంనాడు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం అమలు లోనికి తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత పది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసనలు కొనసాగిస్తున్న ఈ బంద్‌లో ఇతర విపక్ష పార్టీలు కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు ఆందోళనకు సీపీఐ (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్‌ సంఘీభావం ప్రకటించాయి.

బీజేపీ ఆమోదించుకున్న మూడు రైతు వ్యతిరేక చట్టాలు, ఫెడరల్‌ వ్యతిరేక అవలక్షణాలున్న ఎలక్ట్రిసిటీ బిల్లు-2020ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు శనివారం ఆ పార్టీల ప్రధాన కార్యదర్శులు ఢిల్లీలో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దేశీయ వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న రైతాంగంపై అధికార బీజేపీ దాని సైద్దాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న విష ప్రచారాన్ని లెఫ్ట్‌ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆందోళన చేస్తున్న రైతుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలిపాయి. తమ పార్టీల నేతలు రాష్ట్ర, జిల్లా, క్షేత్రస్థాయిలో బంద్‌ విజయవంతంలో కృషి చేయాలని చెప్పాయి. దాంతోపాటు, ఇతర రాజకీయ పార్టీలు కూడా రైతాంగ నిరసనలకు బహిరంగంగా మద్దతు తెలపాలని కోరాయి.